29 July, 2026 | 2:14 AM

‘సీఎంఆర్’ను మళ్లించిందెవరు?

29-07-2026 01:35 AM
  1. రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు 
  2. ధాన్యం దారి మళ్లించిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు 
  3. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్న ఎంపీ వేం నరేందర్‌రెడ్డి
  4. శరణు కోరిన మహబూబాబాద్ జిల్లా మిల్లర్లు?

(బండి సంపత్ కుమార్)

మహబూబాబాద్, జూలై 28 (విజయక్రాం తి): ప్రభుత్వం రైస్ మిల్లర్లకు కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం కేటాయించిన ధాన్యం దారి మళ్లడానికి కారకులెవరనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. సీఎంఆర్ కోసం 2023 నుంచి ఇప్పటివరకు రైస్ మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ ద్వారా కేటాయించిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు దారి మళ్లించి సొమ్ము చేసుకుని దర్జాగా తిరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు వారి జోలికి వెళ్లకుండా, కనీసం పట్టించుకోకుండా, ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 2023లో ప్రభుత్వం నుండి ధాన్యం తీసుకున్న మిల్లర్లు సుమారు 20 మంది 90 కోట్ల రూపాయల వరకు ధాన్యాన్ని దిగ మింగినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. ఇందులో 20 రైస్ మిల్లులను ‘డిఫాల్టర్’గా ప్రకటించారు. అయి తే కొందరి వద్ద కొంత మేర ధాన్యం దిగమింగినందుకు 25 పెనాల్టీతో వసూలు చేయగా, మరి కొంతమంది అప్పుడప్పుడు కొన్ని లారీల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చినట్లు చెబుతున్నారు.

ప్రభుత్వం నుండి రైసుమిల్లర్లకు ఆయా సీజన్లలో సివిల్ సప్లై శాఖ ద్వారా ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించడం జరుగుతుంది. ఎవరికి ఎంత దాన్యం ఇచ్చారు, ఆ దాన్యం పరిస్థితి ఏమిటని ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అయితే తనిఖీలకు వచ్చే సమయంలో అధికారులు చూసి చూడనట్లు వదిలేయడం, ధాన్యం లేకున్నా ధాన్యం ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేయడం, ఇందుకోసం మిల్లర్ నుండి ప్రతి నెల వారీగా కొంత చొప్పున ‘మామూళ్ల’ను పుచ్చుకోవడం వల్లే మిల్లర్లు కొందరు ప్రభుత్వ ధాన్యాన్ని పూర్తిగా పక్కదారి పట్టించడానికి కారణంగా మారిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. 

సివిల్ సప్లై శాఖకు చెందిన అధికారులతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ ఇలా అనేక శాఖలకు సంబంధించిన అధికారులు తరచుగా ధాన్యం కేటాయించిన మిల్లులకు వెళ్లి తనిఖీ నిర్వహించి ఎప్పటికప్పుడు ‘మూమెంట్’ రాయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే అనేకసార్లు తనిఖీలకు వెళ్లిన అధికారులు అక్కడ వాస్తవ స్థితిని తొక్కిపెట్టి మిల్లర్లు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడి తప్పుడు రిపోర్టులు ఇవ్వడం వల్లే, కొన్ని మిల్లులో ధాన్యం పూర్తిగా పక్కదారి పట్టడానికి కారణంగా చెబుతున్నారు. 

దొడ్డిదారులకు కొందరు ‘అక్రమార్కు’లు సహకరించడం వల్లే కొందరు రైస్ మిల్లర్లు కోట్ల రూపాయల ధాన్యాన్ని అప్పనంగా అమ్మేసి ఇతర వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టి, దర్జాగా బయట తిరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెతుతున్నాయి. మూడేళ్లుగా కోట్ల రూపాయల ధాన్యాన్ని దారి మళ్లించిన కొందరు మిల్లర్లపై ఎటువంటి చర్యలకు పూనుకోకపోవడంతో, దీన్ని ఆసరాగా చేసుకొని మరికొంతమంది మిల్లర్లు అడ్డదారులు తొక్కాడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

2025 సంవత్సరంలో మిల్లర్లకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇచ్చిన దాన్యంలో కూడా కొందరు మిల్లర్లు కొంతమేర పక్కదారి పట్టించినట్లు విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లో రైతుల నుండి ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేసి కేటాయించింది.

కేటాయించిన ధాన్యాన్ని బియ్యం పట్టించి వెంటనే తీసుకోకపోవడం వల్ల ఆ ధాన్యాన్ని నిల్వచేసి నష్టపోయే బదులు అమ్ముకొని తర్వాత ప్రభుత్వం అడిగితే బియ్యం ఇవ్వవచ్చు అనే ఆలోచనతో కొందరు ధాన్యాన్ని విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

ఉమ్మడి వరంగల్ జిల్లా మిల్లర్లపై కేసులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, వరంగల్, ములుగు జిల్లాలో ఇప్పటికే కొందరు మిల్లర్లు గత వానకాలంలో ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన విషయాన్ని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే కేసముద్రంలో ఓ రైస్ మిల్లు యజమానిని అరెస్టు కూడా చేశారు. అయితే ఇదే తర హాలో మిగిలిన రైస్ మిల్లులో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తే కొందరు రైస్ మిల్లర్లు చేస్తున్న అక్రమ బాగోతం పూర్తిగా బట్టబయలు కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వేం నరేందర్‌రెడ్డికి మిల్లర్ల శరణు!

ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు రైస్ మిల్లర్లపై కేసులు నమోదు కావడంతో జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్లు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి శరణు కోరినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం రైస్ మిల్లర్లు వేం నరేందర్‌రెడ్డి వద్దకు వెళ్లి తమపై అధికారులు తీవ్రమైన ఒత్తిడి చేసి 2025 వానాకాలం, యాసంగి సీజన్లలో ఐకెపి కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లులోకి దిగుమతి చేశారని, ఆ ధాన్యం ఇప్పుడు మిల్లు పట్టి బియ్యం పెడితే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం క్వింటాలుకు 67 కేజీల బియ్యం వచ్చే పరిస్థితి లేదని వాపోయినట్లు సమాచారం.

దీనితో కొందరు తప్పని పరిస్థితుల్లో నష్టపోతున్నామని భావనతో ఆ ధాన్యంలో కొంత విక్రయించారని, ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ధాన్యానికి సంబంధించిన డబ్బులను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని, దోషులుగా చూస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దని వేడుకున్నట్లు సమాచారం. అయితే ఇందుకు వేం నరేందర్‌రెడ్డి రైస్ మిల్లర్లకు తప్పులు చేస్తే సహించేది లేదని, ధాన్యాన్ని ఇష్టానుసారంగా విక్రయించుకునే అధికారం మీకు ఎవరిచ్చారు అంటూ, అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదని, అలాంటి వాటికి తాను సహకరించేది లేదని ముఖం మీదే చెప్పి పంపించినట్లు ప్రచారం సాగుతోంది.