16 June, 2026 | 1:22 AM

నిరుద్యోగుల మెరుపు ధర్నా

16-06-2026 12:41 AM
  1. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఆందోళన
  2. 20 వేల కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి డిమాండ్
  3. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

ముషీరాబాద్, జూన్ 15(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలో 20 వేల కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘ఐదు వేల పోస్టులు కాదు.. 20 వేల పోస్టులు ముద్దు’, ‘వీ వాంట్ జస్టిస్’, ‘నిరుద్యోగులకు అడ్డెవరు’ అంటూ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నిరుద్యోగులు ర్యాలీగా చిక్కడపల్లి ప్రధాన రహదారి వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని నిరుద్యోగులు ఆరోపించారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణచివేయలేరని, ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 20 వేల కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో 46ను రద్దు చేసి పోలీసు ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని కోరారు.ఆందోళనలో పాల్గొన్న నిరుద్యోగ జేఏసీ నాయకులు కయ్య వెంకటేశ్, కిరణ్ రాథోడ్, కుమార్, శ్రీకాంత్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న తమను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారన్నారు.