25 July, 2026 | 3:15 AM

ఆనంద ప్రవాహం

28-06-2024 12:05 AM

ఎన్నాళ్లు జీవించామన్నది ప్రధానం కాదు. ఉన్నన్నాళ్లు ఎట్లా బతికామన్నదీ, ఏం చేసామన్నదీ, ఎందరికి ఉపయోగపడ్డామన్నదీ ప్రధానం కావాలి. జీవితం మంచి చెడుల నిర్ణయం మనం చేసే ఆలోచనల మీద, పనుల మీద ఆధారపడి ఉంది. జీవితం అంటే ఖేదం, మోదం, దు:ఖం, సుఖం, విజయం, అపజయం వంటి ద్వంద్వ ఆనందమయం చేసుకోవాలి. సంపూర్ణంగా జీవించే విధంగా జీవితాన్ని శిల్పించుకోవాలి. విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానాలు జీవితాన్ని అర్థవంతం చేయాలి. ఉద్వేగరహితంగా, ఉత్సాహభరితంగా బ్రతుకు ప్రయాణం సాగాలి. చేస్తున్నదంతా ఈశ్వరప్రీతి కోసం చేస్తున్నామని, అకర్తృత్వ భావనను దృఢంగా చేసుకోవాలి. ఇందుకై దైహిక, మానసిక, ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాలి. 

సత్కర్మల ద్వారా దైహికశక్తిని, సదాలోచనల ద్వారా మానసికశక్తిని, సత్యాన్వేషణ ద్వారా ఆత్మశక్తిని, బలీయం చేసుకోవాలి. అధ్యయనం, ఆచరణ జమిలిగా సాగాలి. జీవితం పట్ల ఆసక్తి, అవగా హన, నిశ్చితంగా ఉండాలి. వీటన్నిటితో పాటు జీవితాన్ని ఆనందనిలయంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ ఆనందం నుండి బలాన్ని, స్పష్టతను పొందాలి. సమత్వం, ఏక త్వం, విస్తృత మమకారం ఆనందాన్నిస్తయ్. ఈ ఆనందం, మనుష్య, మనీషా, గాంధర్వ, మానవగాంధర్వ, దేవగాంధర్వ, పితృపితా, ప్రజాపితా, హిరణ్య గర్భానందాలుగా ఎదిగి జీవితాన్ని ఆనందస్థలిగా తీర్చిదిద్దుతుంది. ప్రతి వ్యక్తినీ హితుడిగా, సన్నిహితుడిగా చూడగల విశాలదృష్టిని అనుగ్రహిస్తుంది. వైషమ్యం, వైముఖ్యం ఎరుగని వ్యక్తిత్వాన్ని రచిస్తుంది. నిత్యమూ ప్రేమభావంతో రమిస్తుంది. నిశ్చల, నిర్మల, నిర్మమ, నికేతన, నిరంజన ఆనంద భూమికను సిద్ధపరుస్తుంది. 

తృప్తి అనే సంపదనూ, ఎవరికైనా ఆధారపడని ధీరత్వాన్నీ, వినయాన్నీ జీవితం అల వరచుకుంటుంది. జీవితాన్ని అధివాస్తవిక దృష్టితో చూడగల చూపును, నేర్పును, ఈ అమలిక ఆనందం అందిస్తుంది. 

ఇతరులకు ఉపయోగపడే రీతిని, జీవితం తనను తాను మలచుకుంటుంది. దీనికి నిష్కామ కర్మే కారణం. 

జీవితం కృష్ణసంగీతం! కృషి, ఆకర్షణ, ఆనందం దాని మూలాలు. అవే దాని శిఖరాలు. ఉదాత్త, అనుదాత్త స్థాయిలు, మంద్ర, తార స్థితులు సంగీతాన్ని నడిపిస్తయ్. జీవితమూ అంతే! సుఖం వెంట దుఃఖం, ఆనందం వెంట విషాదం సహప్రయాణం చేస్తుంటయ్. దేనికీ పొంగక, లొంగక, క్రుంగ క, జీవన మాధ్యుర్యాన్ని ఆస్వాదించాలి. దీనికి ఆధ్యాత్మికశక్తి కావాలి. ఆ ఆనందాన్ని, జీవితాన్ని నడపటంతో గాక, సంపూర్ణంగా జీవించటంతో శాశ్వతం చేసుకోవాలి. 

శరీరాన్ని మించిన కర్మ సాధనం మరొకటి లేదు. దానికి వ్యాయామాన్ని, నిరంతర పరిశ్రమను, ఓర్పును అలవాటు చేయాలి. 

మనసు లేని మనం లేము. ఆలోచనా సమూహమే మనసు. ఒక ఆలోచన కలుగగానే దానిని ముందుగా మానవతా పరిమ ళంతో అలది, మానవీయం చేయాలి. వెంట నే భగవద్భావనతో పావనమయం చేయా లి. ఆ వెనువెంటనే అధ్యాత్మభరితం చేయా లి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. తద్వారా ఆత్మప్రజ్ఞను సంస్థితం చేయాలి. 

మన బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్యాలు, మనం అనుభవించే భౌతిక దశలు మాత్రమే! అన్నిటా మనమే ఉన్నాం! చాప ల్యం, ఆవేగం దాటి వృద్ధాప్యం ఒక పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. బాల్యం, అర్థమెరుగని ఆనందాన్ని, యౌవనం, యింద్రియాలకు లోబడిన ఆనందాన్ని అనుభవంలోకి తెస్తే, వృద్ధాప్యం నిర్మలానందాన్ని అనుభవిస్తుంది. నిండుతనం, పండుతనం, మెండుతనం, జీవితాన్ని ఆనందామృత కలశంగా తీర్చిదిద్దుతుంది. 

ఎన్నో జన్మల చివర సాధన ఫలించి, జ్ఞానాన్ని గురించి, పరమానందాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. నిజానికి మానవజన్మకున్న పరమార్థం ఇదే! ఒక ప్రక్క దైనం దిన కార్యకలాపాలను వ్యవహార నిష్ఠగా సాగిస్తూనే, బ్రహ్మనిష్ఠను కొనసాగించాలి! రెంటినీ సమన్వయంతో అనుష్ఠానం చేయా లి. జీవితం విసిరే సవాళ్ళు, ఈ రెండు నిష్ఠల ముందు తేలిపోతయ్, కాలిపోతయ్. కార ణం? ఈ నిష్ఠ, జ్ఞానాన్ని అందిస్తుంది కనుక! ఆ జ్ఞానం అగ్నివలె వెలిగి, కర్మానుభవాలను దగ్ధం చేస్తుంది. అనుభూతిని విభూతిగా మిగులుస్తుంది. 

సేవ వేరు! చాకిరీ వేరు!

చాకిరి కూలినిస్తుంది. 

సేవ అహంకార, మమకారాలను నియంత్రించి, ఏ ఆనందం జీవన అంతర్వాహిని అనుకుంటున్నామో, అటువంటి శాశ్వతానందాన్ని కలిగించి, జీవితాన్ని కళాత్మకం చేస్తుం ది. సమకాలీన ప్రపంచంలో సేవే నిర్వాణ సోపానం. 

ఇంద్రియాలు, ప్రాపంచిక వస్తు సముదాయం సుఖాన్నిస్తయ్. తాత్కాలిక సంతో షాన్ని కలిగిస్తయ్. అవి మాసిపోయేవే! అవి దైహిక, మానసిక స్థాయిలకే పరిమితం!

ఆనందం హృదయానికి సంబంధించినది. నిష్కామకర్మల వలన, వస్తువులను దాటి సద్వస్తువైన ఆత్మస్ఫురణ వలన ఆనందం పెల్లుబుకుతుంది. 

జీవితాన్ని సమగ్రంగా, సమన్వయంగా, సమ్యక్ దర్శనంతో జీవించటం ప్రారంభిస్తే, అన్నీ సమసిపోగా ఆనందమే మిగులుతుంది. ఆనందం, ఆలోచనలను వెలిగిస్తుం ది. స్వేచ్ఛను, శుభేచ్ఛను సహజశీలంగా అనుగ్రహిస్తుంది. అటువంటి ఆనందం, ఆరోగ్యా న్ని, ఆయుష్షును పరిపూర్ణం చేస్తుంది. 

మనం దివ్యులమని, ఆత్మస్వరూపులమ ని, ఆనందం మన సహజ స్వభావమని ఈ శోపనిషత్ ఎరుక పరుస్తుంది. 

జీవితాన్ని నిరసించక, రసాత్మక కలాపంగా జీవించమని బోధిస్తూ, జీవన పరిణామప్రాప్తిని, ఇప్పుడే ఇక్కడే సాధించుకోమని మార్గనిర్దేశనం చేస్తుంది. జీవప్రజ్ఞ దైవప్రజ్ఞతో కలిసిననాడు, జీవితం కాలప్రవాహంలో సైతం నిలకడగా తన పయనాన్ని సాగిస్తుంది. 

ఈ అనుభూతులన్నిటినీ మరణానంతర సుఖంగా కాక, పరిమిత జీవన కాలంలోనే పొందే దిశగా, జీవితాన్ని పరిపూర్ణంగా జీవించమంటున్నది ఈశోపనిషత్.  

- వీఎస్‌ఆర్ మూర్తి