ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టండి
- పంట అవశేషాలను తగలబెట్టోద్దు
- రైతులను కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, జూన్ 3(విజయక్రాంతి): వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం తో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత వాతావరణ శాఖతో పాటు పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. జిల్లాలోని జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న డెడ్ స్టోరేజ్ నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
వర్షాకాలం ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, పచ్చి రొట్టె విత్తనాలను సబ్సిడీపై అందజేయనున్నట్లు పేర్కొన్నారు. తక్కువ నీటి అవసరమయ్యే పంటలను రైతులు సాగు చేయాలని సూచించిన మంత్రి ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు. రైతులు సాగు చేసే ప్రత్యామ్నాయ పంటల కొనుగోళ్లను కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, మార్కెటింగ్ పరంగా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, కల్లూరు ఫ్యాక్టరీ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని చెప్పారు.
ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగును విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించడం వల్ల దేశీయ రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినప్పటికీ స్పందన లేదన్నారు. పురుగుమందుల అధిక వినియోగం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారత వ్యవసాయ ఉత్పత్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ధాన్యం కొనుగోలులో అగ్రస్థానం
ఖమ్మం జిల్లా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ఇందుకు జిల్లా కలెక్టర్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, సిబ్బంది చేసిన కృషిని అభినందిం చారు. జిల్లాలో అనేకసార్లు అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది రైతులు వరి కొయ్యలు, పంట అవశేషాలను కాల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పక్కనే ఉన్న పంటలు, తోటలకు నష్టం వాటిల్లడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రాణనష్టం కూడా సంభవించిందన్నారు.
పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోతుందని హెచ్చరించారు. అవశేషాలను కాలుస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.






