ధాన్యం కొనుగోళ్లపై ఫోకస్
- నిత్యం కేంద్రాలను సందర్శిస్తున్న కలెక్టర్లు
- కొనుగోళ్లపై రైతులకు భరోసా
- జాప్యం జరుగొద్దని అధికారులకు ఆదేశాలు
కరీంనగర్, మే10(విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు.రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టర్లు నిత్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు.ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పిస్తున్నారు.తూకం వేసిన ధాన్యా న్ని వెంటనే మిల్లులు, స్టోరేజ్ కేంద్రాలకు తరలించాలని తాజాగా ఆదేశించారు.ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుయుండని రైతులు ఆందోళన లకు దిగిన నేపథ్యం లో కరీంనగర్‌జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకం గా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ని ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు కట్టుబడి ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. కొనుగోలు ప్రక్రియ ను నిరంతరం పర్యవేక్షిస్తూ, అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
ఈ చర్యల ఫలితంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్రమబద్ధంగా, రైతులకు అనుకూలంగా కొనసాగుతోంద న్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం రాత్రివేళ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యాన్ని టర్పాలిన్లతో కప్పివేయడం, నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టడం, అవసరమైతే అదనపు రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.అదేవిధంగా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల్లో ఎక్కువసేపు నిల్వ ఉంచకుండా వెంటనే సమీపంలోని మిల్లులు లేదా స్టోరేజ్ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ....
సిరిసిల్ల లో...
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించి తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చూడాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పరిధిలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతుల సౌకర్యార్థం కల్పించిన సౌకర్యాలు, దిగుబడి వివరాలు, హమాలీల గురించి ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన వెంటనే జాప్యం చేయకుండా తూకం వేయాలని, అందుకు సరిపడా హమాలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.
జగిత్యాల లో.....
జగిత్యాల జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత సాఫీగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు.ధాన్యం తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశామని, లారీల లభ్యతతో పాటు, రవాణాలో ఎక్కడా జాప్యం జరగకుండా ఉండేందుకు ట్రాక్టర్లను కూడా వినియోగిస్తున్నామని, దీనివల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు త్వరితగతిన చేరుతోందని, రైతులు పండించిన పంటకు వెంటనే నగదు అందేలా ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 88,156.400 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి కాగా, అందులో 73,303.000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే మిల్లులకు విజయవంతంగా రవాణా చేయడం జరిగింది. అలాగే 4,070 మంది రైతుల ఖాతాల్లో రూ. 69.54 కోట్ల నగదును ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిందని తెలిపారు.
పెద్దపల్లి లో...
ధాన్యం అన్ లోడింగ్ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.జిల్లాలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర- ధాన్యం అన్లోడింగ్, నిల్వలు, ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ షీట్ల జనరేషన్ తదితర అంశాలను పరిశీలించారు. హమాలీల సంఖ్యను వెంటనే పెంచి అన్లోడింగ్ ప్రక్రియను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.






