calender_icon.png 20 December, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్.. దొంగలకు ఫుడ్..?

20-12-2025 12:17:00 AM

  1. రెచ్చిపోతున్న అక్రమార్కులు
  2. యథేచ్ఛగా మట్టి చోరీ...
  3. దర్జాగా భూముల అక్రమణ...
  4. మొద్దు నిద్రలో అధికారులు
  5. లక్షలు గడిస్తున్న ట్రాక్టర్ ఓనర్లు 

బెల్లంపల్లి, డిసెంబర్ 19: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భూ అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. ఓ వైపు భూ ఆక్రమణలు, మరో వైపు మట్టి దొంగతనాలు దర్జాగా సాగుతున్నాయి. భూ, మట్టి మాఫియా అక్రమాలకు బెల్లంపల్లిలో అడ్డు చెప్పేవారే కరవయ్యారు. అధికార అండదండలు, వారి దన్నుతోనే ఈ మట్టి గ్యాంగ్ లు తెగరెచ్చిపోతున్నాయని తెలుస్తుంది. బెల్లంపల్లి ప్రభుత్వ భూములని లక్ష్యంగా చేసుకొని  అక్రమార్కులు ఈ అక్రమాలను యదే చ్చగా సాగిస్తున్నారు.

అందుకు సాక్షి భూతంగా బెల్లంపల్లిలోని ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంగా మట్టి అక్రమ రవాణా, భూ కబ్జాలనే పేర్కొనవచ్చు. అనుమతి లేకుండా ట్రాక్టర్ ఓనర్లు మట్టిని అక్రమంగా ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. ఎంతో విలువైన ఈ మట్టిని అక్రమం గా తరలిస్తుంటే.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతున్నారు. జోరుగా సాగుతోన్న ఈ మట్టి దందాతో ట్రాక్టర్ ఓనర్లు లక్షలు దండుకుంటున్నారు.

ఎంత ముట్టాయో...?

దర్జాగా ఫుడ్ ప్రాసెసింగ్ లో మట్టిని తోడేస్తుంటే అధికారులు ఉత్తగనే మౌనంగా ఉంటు న్నారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రాక్టర్ ఓనర్లు ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడి ప్రభుత్వ భూముల్లోని మట్టిని అమ్మేస్తున్నారని అధికారులపై విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత బహిరంగా మట్టి తరలింపు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. స్వేచ్ఛగా ట్రాకర్లు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కు వెళ్ళి మట్టిని నింపుకొని వెళుతుండటం ఈ మట్టి దందాకు అధికారుల వత్తాసు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమయిపోతుంది.

ట్రాక్టర్ ఓనర్లు మట్టిని తమ సొత్తులాగా అమ్మేస్తున్నారనే విమర్శలు భగ్గుమంటున్నాయి. మట్టి తరలింపు విషయంలో అధికారులు ట్రాక్టర్ ఓనర్ల మధ్య భారీ డీల్ తోనే ఈ  వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తోంది. పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయని, అందుకే కాబోలు మట్టి దందా ఇంత పెద్ద ఎత్తునా సాగుతుందనే అనుమానాలు లేకపోలేదు. ప్రభుత్వ భూములు, వనరులను కాపాడాల్సిన అధికారులు ఇలా మట్టి దొంగలకు అప్పగించి చోద్యం చూడటం ఎంత వరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు.

‘కంచే చేను మేస్తే‘ఇక  ప్రభుత్వం భూములను కాపాడేది ఎవరని, ఈ అక్రమాలను ఎవరూ కట్టడిచేస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారుల ప్రమేయంతోనే ఈ అక్రమాలన్ని సాగుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. దీంతో బెల్లంపల్లిలో భూ అక్రమాలు, మట్టిదందా ‘మూడు పూలు ఆరు కాయలుగా‘ సాగుతున్నది. ఈ నేపథ్యంలో బెల్లంపల్లిలో సాగుతున్న ఈ అక్ర మ దందాకు అడ్డుకట్ట వేసేదెవరనేది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్నగా మిగిలిపోయింది.

అక్రమాలకు అడ్డా...

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. రక్షణ పూర్తిగా కరవైం ది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ప్రాంతంలో 600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 355 ఎకరాల భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కు కేటాయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. విశాలమైన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. దీంతో ఈ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఓవైపు మట్టిని ఎత్తుకెళ్తున్నారు. మరోవైపు భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

ఇలా అటు మట్టి, ఇటు భూ అక్ర మణ గ్యాంగులు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ భూ ములను కొల్లగొడుతున్నారు. మట్టి దందా వల్ల భూ వనరులు స్వాహా అవుతుండగా, భూ ఆక్రమణలతో ఫుడ్ ప్రాసెసింగ్ భూము లు  చేజారిపోతున్నాయి. ఈ విషయాన్ని స్థానిక ప్రభుత్వ అధికారులు అస్సలు  పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెల్లుబికుతు న్నాయి. ఈ అక్రమాలు చట్ట వ్యతిరేకమైనవిగా అధికారులకు  కనిపించకపోవడం ఆశ్చ ర్యం కలిగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులైనా దృష్టి సారించాలని బెల్లంపల్లి ప్రజలు కోరుతున్నారు.