20-12-2025 12:20:23 AM
వనపర్తి, డిసెంబర్ 19 (విజయక్రాంతి) : ఇద్దరు గొడవ పడితే మూడొకరికి లాభం జరిగినట్లుగా వనపర్తి నియోజకవర్గంలో పాత కొత్త, నిఖాసు అయిన కాంగ్రెస్ నాయకులు మేమే అంటూ చీలికలు రావడంతో అనూహ్యంగా ఇతర పార్టీ వర్గానికి మేలు జరుగుతోందని అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలు వనపర్తి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది .
మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పావులు కదిపారు. బల బలాలు మంచి చెడులు సరైన వ్యక్తిని గుర్తించి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ బరిలో దిగారు. ఈ నేపథ్యంలో వనపర్తి రాజకీయంలో రాజకీయ ఉద్దండులుగా పేరొందిన ఆ పెద్దాయన ఎక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.
దానికి తోడు ఆయా గ్రామాల్లోని కాంగ్రెస్ మద్దతు దారులు, అభిమానులు, ముఖ్య నేతలతో నిఖాసైన కాంగ్రెస్ నేతలు మేమే అని చెప్పుకున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరోపిస్తున్నారు. దాని ఫలితంగానే ప్రధాన గ్రామాల్లో కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం తగ్గడంతో పాటు బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని ఆరోపించారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతోందని ఈ అంశాలన్నింటిని సరైన ఆధారాలతో ఏఐసిసి, పిసిసి, అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించడం పెను దుమారాన్ని రేపుతోంది.
వర్గపోరుతో కొన్నిచోట్ల ఓటమి..
వర్గ పోరుతో దాదాపుగా 15 నుండి 20 గ్రాను పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవాల్సిన చోట వెన్ను పోటు వల్ల గులాబి పార్టీ బలపరిచిన అభ్యర్థులు గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారని ఎమ్మెల్యే బహిరంగంగానే విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది.
నాటి నుండి వర్గ పోరే.
నిధులు, నియాచుకాల పేరుతో ఉద్యమ పార్టీగా పేరొంది 10 ఏండ్లు అధికారాన్ని చేతబట్టిన బిఆర్‌ఎస్ ను ఓడించాలంటే యువతకే సాధ్యం అవుతుందన్న ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి నాడు తనకు అవకాశాన్ని కల్పించారు. కాని నాటినుండి నేటివరకు అభివృ ద్ధి అంశాన్ని పక్కన బెట్టి కొత్త పాత అంటూ వర్గ పోరును నెలకొప్పి కాంగ్రెస్ పార్టీని క్షీణింప జేయాలని కుట్రలను ఆ పెద్దాయన చేసారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన గ్రామ పంచాయతి ఎన్నికల్లో తేటతెల్లం అయిందన్నారు.