19 June, 2026 | 3:59 AM

ఫుడ్‌సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ తనిఖీలు

19-06-2026 02:32 AM

హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో హైజిన్ లోపాలు

‘-అంతేరా’, ‘లా పినోజ్ పిజ్జా’ యాజమాన్యాలకు నోటీసులు

శేరిలింగంపల్లి, జూన్ 18 (విజయక్రాంతి): నగరవాసుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్ర స్థాయిలో మెరుపు దాడులు చేపట్టారు. ఈ క్రమంలో మియాపూర్ మదీనాగూడలోని ప్రముఖ ’అంతేరా’ రెస్టారె్ంప టాస్క్ ఫోర్స్ బృందం సోదాలు నిర్వహించి తీవ్ర ఉల్లంఘనలను వెలికితీసింది. వంటకు సిద్ధపరచి ఉంచిన కాలీఫ్లవ్ప ఫంగస్ పట్టడం, కూరగాయలు కుళ్లిపోవడం వంటి అసహ్యకరమైన దృశ్యాలు బయటపడ్డాయి.

అంతేకాకుండా, ఆరోగ్యానికి హానికరమైన పాత నూనెను వంటల్లో వాడటం, నిల్వ ఉంచిన కూరగాయలపై లేబుల్స్ లేదా ఎక్స్పైరీ తేదీలు లేకపోవడం వంటి తీవ్ర అనుమానాస్పద అంశాలు అధికారులను కలవరపెట్టాయి. ఇక హైటెక్ సిటీ ప్రాంతంలోని జూబ్లీ ఎంక్లేవ్లోని ’లా పినోజ్ పిజ్జా’ రెస్టారెంట్లో తనిఖీలు జరపగా మరింత భయపెట్టే దృశ్యాలు ఎదురయ్యాయి. పిజ్జా పదార్థాలు నిల్వ ఉంచిన ఫ్రిజ్లో పురుగులు సంచరించడం, కిచెన్ అంతా బొద్దింకలతో నిండిపోవడం, వెజ్-నాన్వెజ్ సామగ్రిని ఒకేచోట ఉంచడం వంటి ఘోర ఉల్లంఘనలు బయటపడ్డాయి.

అంతకు మించి ఆహార నిల్వ ప్రాంతంలో బల్లి విసర్జనలు కనిపించడంతో అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ రెండు రెస్టారెంట్ల యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ బృందం ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా అన్ని లోపాలను సరిద్దుకోకపోతే లైసెన్సులు రద్దు చేసి, రెస్టారెంట్లను సీజ్ చేసే చర్యలు తీసుకుంటామని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు బయట తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా అపరిశుభ్రత లేదా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.