30-06-2024 12:05:00 AM
‘కల్కి’ చిత్రంలో అప్పు ఇచ్చిన వారంతా తక్షణం తీర్చాల్సిందేనంటూ భైరవ మీదకి కట్టగట్టుకుని వస్తారు. అతడు సముదాయించే ప్రయత్నం చేసినా పట్టించుకోని వారంతా, రాక్సీ రాకతో అక్కడి నుంచి చల్లగా జారుకుంటారు. భారతీయ సినీ చరిత్రలోనే నూతన అధ్యాయం లిఖిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో రాక్సీగా సందడి చేసిన దిశా పటానీ, వీరుడైన భైరవను కూడా లెక్కచేయక కిక్ ఇస్తుంది. సినిమా చూసిన వాళ్ళకు ఈ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ఇవి సినిమా స్టంట్స్‌కే పరిమితం అనుకునేరు. యుద్ధ విమానాల పైలట్ కావాలనుకున్న ఈ అందాల సుందరి.. కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లలో ఆరితేరింది.
ఇప్పటికైనా అర్థమైందా రాక్సీ రప్ఫాడించేస్తుందని..! ఇంకా ఈ విషయంలో ఏవైనా అనుమానాలుంటే అక్టోబర్ 10న రానున్న ‘కంగువ’ సినిమాతో అవి కూడా పటాపంచలవడం ఖాయం. ఈ సినిమాలో సూర్యతో పాటు సాహసోపేతమైన పోరాటలు చేసిందీ బరేలీ భామ. ‘పటానీ’ పోరాటాల సంగతి కాసేపు పక్కన పెట్టి మరో ‘దిశ’గా వెళితే.. సినిమా లో “ప్రపంచంలో ఒక్కటే ఒక సైడ్.. నీ సైడ్” అని చెప్పే భైరవని కూడా ప్రేమించి కాంప్లెక్స్ లోకి వెళ్ళాలన్న అతడి కోరికను తీరుస్తుంది.
సర్వాంగ సుందరమైన ఆ కాంప్లెక్స్‌లో వారిద్దరూ ముచ్చటగా విహరిస్తూ ఓ పా ట కూడా పాడుకుంటారు. ప్రభాస్ సరదా స్టెపులతో సాగిన ‘ట.. టకరా’ అనే ఈ గీతం తాజాగా విడుదలైంది. మరెందుకాల స్యం..? ఆ పాటకి మీరూ కాలు కదపండి. అన్నట్టు.. ‘కల్కి’ తొలి భాగంలో హీరోయిన్ లేని లోటు కొంతవరకు తీర్చిన దిశా రెండవ భాగంలో కనపడుతుందంటారా?!