18 August, 2026 | 1:47 AM

కాంగ్రెస్‌కు కుటుంబమే ముఖ్యం

18-08-2026 12:35 AM
  1. వందేమాతరం వేళ నేతల తీరు బట్టబయలు  
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కాంగ్రెస్‌కు దేశం కంటే ఒక కుటుంబమే ముఖ్యమని, వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరు దేశ ప్రజలు గమనించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. దేశాన్ని విభజించాలని ప్రయత్నించే కొన్ని శక్తులు ఉన్నాయని, విద్యార్థులు, యువతను ప్రభావితం చేసి వారి ఆలోచనలను దేశ వ్యతిరేక దిశగా మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

అడవుల్లో నక్సలిజం తగ్గుముఖం పడుతున్న సమయంలో మేధావుల ముసుగులో అర్బన్ నక్సల్స్ యూనివర్సి టీలను అడ్డాగా చేసుకుని యువతను ప్రభావితం చేసి కొత్త తరాన్ని తప్పుదోవ పట్టించేం దుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరును దేశ ప్రజలు గమనించారని పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీలో కూడా వందే మాతరం ఆలపించకపోవడం వంటి ఘటనలను గమనించాలన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్న ‘టుక్డే- భావజాలాన్ని పెంచిపోషించే శక్తులను మనం గుర్తించాలని, ఈ విషయాన్ని ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.