19 April, 2026 | 2:37 AM

ఎవరికి మోదం, ఎవరికి ఖేదం?

19-04-2026 12:00 AM

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో కేంద్రంలోని అధికార బీజేపీకి భంగపాటు ఎదురైనట్టు అయ్యింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ హయాంలో పార్లమెంట్‌లో వీగిపోయిన మొదటి బిల్లు ఇదే కావడం గమనార్హం. మహిళల సాధికారత పేరిట డీలిమిటేషన్‌కు ఈ బిల్లును ముడిపెట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు దీన్ని అడ్డుకోవడంతో బీజేపీకి షాక్ తగిలింది.

ఊహించని పరిణామంతో కంగుతున్న కేంద్ర ప్రభుత్వం దీనికి అనుబంధంగా ప్రవేశపెట్టాలనుకున్న మరో రెండు బిల్లులు డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా, 298 మంది మద్దతుగా, 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం విదితమే.

రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో 2/3వ వంతు మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బిల్లు వీగిపోవడంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. మహిళా సాధికారతకు ప్రతిపక్షం వ్యతిరేకమని అధికార బీజేపీ వ్యూహాత్మకంగా దాడిచేయగా, మహిళలకు రిజర్వేషన్ల ముసుగులో డీలిమిటేషన్ చేపట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇదివరకే తాము మద్దతిచ్చామని విపక్షాలు ప్రతిదాడికి దిగాయి. మహిళల సాధికారత పట్ల బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో ఆమోదం పొందిన బిల్లును ప్రవేశపెట్టాలని, దానికి మద్దతిస్తామని ప్రధానికి రాసిన లేఖలో విపక్షాలు కౌంటర్ ఇచ్చాయి.

లోక్‌సభ సభ్యుల సంఖ్యను పెంచకుండానే, ప్రస్తుతమున్న ౫౪౩ స్థానాలలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని ఆ లేఖలో సలహా కూడా ఇవ్వడం విశేషం. అయితే, మహిళలకు పట్టం కట్టే ఈ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా తమకే లబ్ధి చేకూరుతుందని భావించిన కేంద్రప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ప్రతిపక్షాన్ని ఇరకాటంలో నెట్టివేసింది.

ఈ బిల్లును అడ్డుకున్న విపక్షం బీజేపీ ట్రాప్‌లో చిక్కుకున్నట్టు అయ్యింది. దాంతో కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు మహిళలకు వ్యతిరేకమని ప్రచారం చేసే అవకాశాన్ని బీజేపీ చేతికి ప్రతిపక్షాలే అందించినట్టయింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకునే అవకాశముంది. ఇప్పుడు విపక్ష పార్టీలు దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, నారీశక్తికి పట్టం కట్టే ఈ బిల్లు వీగిపోవడం ఎవరికి మోదం, ఎవరికి ఖేదంగా మారుతుందన్నది భవిష్యత్తులో స్పష్టమవుతుంది.