బీసీలకు భూమిని హక్కుగా పంచాలి
ఇటీవల వెలువడిన సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు తెలంగాణ రాష్ట్రంలో సాగు భూమి విస్తీర్ణం పెరిగిందని ఘనంగా చాటిచెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూ విస్తీర్ణం 112.08 లక్షల హెక్టార్లు (276.96 లక్షల ఎకరాలు) ఉండగా, నికర సాగు భూమి సుమారు 58.97 లక్షల హెక్టార్లు (52.61%) ఉన్నట్టు తేలింది. మొత్తం సాగుయోగ్య భూమి (ఫాలోలు, కల్టరబుల్ వేస్ట్, పాస్ట్యూర్స్ కలిపి) సుమారు 69.79 లక్షల హెక్టార్లకు (62%) చేరుతోంది.
అయితే, ఈ అంకెల్లో దాగిన సామాజిక అన్యాయం మాత్రం అట్టడుగు వర్గాల గుండెల్లో ప్రశ్నగా మిగిలిపోతోంది. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రకారం 70.59 లక్షల మంది రైతుల చేతుల్లో 63.12 లక్షల హెక్టార్ల భూమి (సుమారు 1.56 కోట్ల ఎకరాలు) ఉందని లెక్కలు చెబుతున్నా, ఈ కోట్లాది ఎకరాల పంపిణీలో సామాజిక సమతుల్యత ఎక్కడ ఉందన్నది అసలైన ప్రశ్న. నిజానికి ఈ దేశంలో భూమి కేవలం వ్యవసాయానికి సంబంధించినది కాదు;
అది అధికారం, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవంతో ముడిపడిన మౌలిక అంశం. ఎవరి చేతిలో భూమి ఉంటుందో వారి చేతిలోనే ఉత్ప త్తి సాధనాలు, మార్కెట్ శక్తులు, చివరకు రాజకీయ అధికారం కూడా కేంద్రీకృతమవుతాయని చరిత్ర చెబుతోంది. శతాబ్దాలుగా భూమి యాజమాన్యం కేవలం కొద్ది వర్గాల చేతుల్లోనే నిలిచిపోవడం యాదృచ్ఛికం కాదు, అది చరిత్రాత్మకంగా నిర్మించిన సా మాజిక వివక్ష ఫలితం.
రాష్ట్ర స్థాయి సర్వేలు ఉన్నప్పటికీ, కులాలవారీగా భూమి యాజమాన్యంపై స్పష్టమైన సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు. ప్రభుత్వం పూర్తి డేటాను బయటపెట్టడం లేదు. భూమి ఎవరి చేతుల్లో ఎంతగా కేంద్రీకృతమై ఉందో వెల్లడించకుండా సామాజిక న్యాయం గురించి మాట్లాడటం అర్థరహితం. అందుకే కులాలవారీగా భూమి యాజమాన్యంపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
ఇదే భూమి అసమానతలను బయటపెట్టి, సమాన పంపిణీకి మా ర్గం చూపే తొలి అడుగు అవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక సగటు రైతు కుటుం బం గౌరవప్రదంగా జీవించడానికి కనీసం 2 నుంచి 5 ఎకరాల భూమి అవసరమని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తుంటే, మన దేశంలో మెజారిటీ బీసీ, దళిత, గిరిజన కుటుంబాలు భూమి లేని కూలీలుగా మగ్గిపోతున్నారు.
ఒకవైపు రియల్ ఎస్టేట్ మాఫియా పరిశ్రమల పేరిట వేల ఎకరాల భూమి సేకరిస్తుంటే, భూమి లేని బీసీలకు హక్కుగా భూమిని పంచాలనే ఆలోచన విధానాల స్థాయిలో ఎందుకు రావడం లేదు? అసలైన అభివృద్ధి అంటే భూమిని, వృత్తిని, ఆధునిక పారిశ్రామికీకరణను అనుసంధానించడమే. ప్రతి భూమిలేని బీసీ కుటుంబానికి కనీసం 2-3 ఎకరాల భూమిని హక్కుగా కల్పించి, ఆ భూమిపైనే వారి వృత్తి నైపుణ్యాలను ఆధునిక సాంకేతికతతో జోడించి చిన్న తరహా పరిశ్రమలను నిర్మించినప్పుడే నిజమైన ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది.
ప్రస్తుతం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ 58,950 హెక్టార్లను నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిగా నోటిఫై చేసింది. అయితే, ఆ భూములను బీసీల సంప్రదాయ వృత్తులు, చిన్న తరహా పరిశ్రమలకు ఎందుకు ఇవ్వడం లేదు? 2021 అగ్రికల్చర్ సెన్సస్‌లో బీసీలను ‘అదర్స్’ కేటగిరీలో చూపడం తో వారి భూమి లేమి సమస్య బయటపడలేదు. రాష్ట్రంలో ఎస్సీలకు 6.10 లక్షల హెక్టార్లు (9.68%), ఎస్టీలకు 7.53 లక్షల హెక్టార్లు (11.93%) భూములున్నాయి. బీసీలు రాష్ట్ర రైతుల్లో అత్యధిక భాగం అయినప్పటికీ, వారి భూమిని ఆధిపత్య వర్గాలతో కలిపి ఎందుకు లెక్కించారో ప్రభుత్వం స్పష్టంగా తెలపడం లేదు.
బీసీలకు భూమిని హక్కుగా పంచాలనే డిమాండ్ ఒక సంక్షేమ పథకం కాదు, అది రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి అత్యవసరమైన విప్లవాత్మక అడుగు. చివరగా, ఈ లక్ష్యం సా ధ్యం కావాలంటే బీసీలు, దళితులు, గిరిజనులు, ఇతర శ్రమ జీవి వర్గాలు ఐక్యంగా పోరాడాలి. భూ పోరాటమంటే ఆస్తి కోసం కాదు, అది ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం, భవిష్యత్తు తరాల కోసమని గుర్తిం చాలి.
సత్యశోధక మహాసభ ప్రతినిధి






