13-05-2025 12:00:33 AM
సంగారెడ్డి, మే 12(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచనూర్ గ్రామానికి చెందిన బేగరి చిన్నశివయ్యకు సర్వేనెంబర్ 267/అ లో 13 గుంటల పట్టా భూమి ఉంది. అయితే 2018 నుంచి ధరణిలో భూ వివరాలు పరిశీలిస్తే ఆ భూమి ధరణి సాంకేతిక నిషేధిత జాబితాలో ఉంది.
ఆ రైతు పలుసార్లు అధికారుల చుట్టూ..కోర్టు చుట్టూ తిరిగి సమస్య పరిష్కరించక అలసిపోయాడు. గతనెలలో ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశాడు. ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధానంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రత్యేకత చొరవ చూపుతూ ఈ సమస్యను ధరణి సాంకేతిక నిషేధిత సమస్య నుండి నేటి భూభారతి చట్టంతో ఆ సమస్యను వెంటనే పరిష్కరించి నిషేధిత జాబితా నుండి తొలగించి రైతు సొంత భూమిగా మార్చి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలోనే వేలిముద్ర వేయించి సమస్యను చాలా త్వరగా పరిష్కరించారు.
రైతు పట్టా భూమి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి రైతుకు అందజేశారు. 2018 నుంచి ఈ సమస్య ఉందని, ఎన్నోసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగానని, సమస్య పరిష్కారం కాలేదని ప్రజావాణిలో తన సమస్య పరిష్కారం దొరకడంతో సంతోషంగా ఉందని రైతు బేగరి చిన్నశివయ్య సంతోషం వ్యక్తం చేశారు.