అసెంబ్లీనీ భ్రష్టుపట్టించారు!
ప్రతి పక్షంపై బురదజల్లేందుకే సమావేశాలు
15 రోజులు సమావేశాలు నిర్వహించాలి
బీఆర్‌ఎస్‌పై అభాండాలకు సభలోనే సమాధానం చెబుతాం
45 టీఎంసీలతో ఏ జిల్లాను ఎండబెడతారు?
హుందా అనే పదం పలికే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు
ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థల మాదిరిగానే అసెంబ్లీని కూడా భ్రష్టుపట్టించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శిం చారు. బీఆర్‌ఎస్ హయాంలో మొదటి టర్మ్‌లో సంవత్సరానికి 32 రోజులు అసెంబ్లీని నడిపామని, కాంగ్రెస్ 2024లో 24 రోజులు, 2025లో 16 రోజులు మాత్రమే అసెంబ్లీ పెట్టారని తెలిపారు. సగటున 20 రోజులు కూడా సమావేశాలు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంపై బురద జల్లడానికే సమావేశాలు పెడుతున్నారు.. తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదని విమర్శించారు. అసెంబ్లీని నడపడానికి ప్ర భుత్వం భయపడు తోందన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియా తో హరీశ్‌రావు చిట్‌చాట్ నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ ఇచ్చిన ఒక్క అంశంపై చర్చ పెట్టకపోతే అసెంబ్లీని నడిపేది ఎందుకు అని నిలదీశారు. అసెంబ్లీని కాంగ్రెస్ అంగబలంతో, మందబలంతో నడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
ఉత్తమ్ లేఖ రాశారా..? లేదా?
పాలమూరు ప్రాజెక్టు టీఎంసీలను 90టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కుదించారని, 45 టీఎంసీలు చాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారా లేదా అని ప్రశ్నించారు. డిఫెన్స్‌లో పడినప్పుడు అసెంబ్లీని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే కేసీఆర్ బయటకు వచ్చి పోరాటం చేశారని, అప్పుడు అసెంబ్లీలో లెంపలు వేసుకుని నిర్ణయాన్ని వాపస్ తీసుకుని తీర్మానం చేశారని గుర్తు చేశారు. 45 టీఎంసీలతో నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలో ఏ జిల్లాను ఎండబెడతారని నిలదీశారు. ఏడాది కింద డీపీఆర్ వాపస్ వస్తే ఇప్పటి వరకు ఎందుకు తిరిగి సబ్మిట్ చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అదే విషయాన్ని సూటిగా ప్రశ్నించారని గుర్తు చేశారు. అసెంబ్లీని 15 రోజులు నడపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చర్చ పెట్టినా మాట్లాడతామన్నారు. మేము పూర్తిగా ప్రిపేర్ అయ్యామని, మీలాగా ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి రామని ఎద్దేవా చేశారు.
సభలో సమయం ఇచ్చేందుకు సిద్ధమేనా?
అసెంబ్లీలో మా మైక్ కట్ చేయకుండా తగిన సమయం ఇచ్చేందుకు స్పీకర్ రెడీగా ఉన్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ హౌస్ కమిటీలు ఇప్పటివరకు వేయలేదని, లోపం స్పీకర్ వద్ద ఉందా లేక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దగ్గర ఉందా అని నిలదీశారు. మీది ప్రజా ప్రభుత్వమైతే ఎరువుల కొరత, రైతు బంధు, రుణమాఫీ, పంట బోనస్‌పై చర్చ అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ చేశారు.
రూ. 5 లక్షల కోట్ల హిల్ట్ పాలసీ కుంభకోణంపై, జాబ్ క్యాలెండర్‌పె, రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ సోకులు, కోఠీ, కొండాపూర్ ఆస్పత్రుల్లో గురకుల పాఠశాలల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో చేరిన అంశంపై, ప్రభుత్వ ఉద్యోగుల డీఏల పెండింగ్‌పై, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం పడ్డ బకాయిలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. బీఏసీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని పట్టు పడతామని తెలిపారు. కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ వేస్తున్న అన్ని అభాండాలకు సభలోనే సమాధానం చెబుతామన్నారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో పీపీటీకి అవకాశమిస్తే బీఆర్‌ఎస్‌కు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుందా అనే పదం పలికే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. అసెంబ్లీలో ఏ సీఎం మాట్లాడని చిల్లర, చిచోరా బాష రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.






