15 April, 2026 | 6:47 AM

మా ప్రాణాలను కాపాడండి మహాప్రభో!

29-12-2025 02:34 AM

హెటిరో పరిశ్రమను తరలించాలి

న్యాయం కోరితే కేసులు నమోదు చేస్తారా ?

సంగారెడ్డి జిల్లా దోమడుగులో విద్యార్థుల నిరసన

గుమ్మడిదల, డిసెంబర్ 28: హెటీరో పరిశ్రమ వ్యర్థ రసాయనాల వల్ల మా ప్రాణాలు పోకుండా రక్షించండని సంబంధిత అధికారులను అడిగితే తమపై కేసులు నమోదు చేస్తారా అంటూ సంగారెడ్డి జిల్లా దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని కేసుల రూపంలో నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్న రెవెన్యూ అధికారులకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఏదేమి జరిగినప్పటికీ తమపై కేసులు పెట్టినా ఉద్యమం ఆగదని, పరిశ్రమను ఎత్తివేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఆదివారం విద్యార్థులు సైతం స్వచ్ఛందంగా నిరసన తెలిపారు.

పరిశ్రమపై  సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించడంలో అలసత్వం విడాలని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ముప్పు వాటిల్లుతుందని గ్రామ పెద్దలు పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని దోమడుగు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు, పాడి పశువులకు, వ్యవసాయ రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దోమడుగు అమరవీరుల స్తూపం నుండి బొంతపల్లి కమాన్ వరకు విద్యార్థులు ప్లకార్డులతో హెటిరో పరిశ్రమను మూసివేయాలని, ఇక్కడి నుండి తొలగించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.