15 April, 2026 | 9:51 AM

నేటి నుంచి అసెంబ్లీ

29-12-2025 02:40 AM
  1. శాసనసభ సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు రె‘ఢీ’

  2. కృష్ణా, గోదావరి నీటి వాటాలు.. సాగునీటి ప్రాజెక్టులపై ప్రధాన చర్చ..

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమై భద్రత

కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, డిసెంబర్  28 (విజయక్రాంతి) : విమర్శ లు.. ప్రతి విమర్శలు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. నింద లు.. అభాండాలతో కొన్ని రోజులుగా మాటల కత్తులు దూసుకున్న అధికార విపక్ష సభ్యులు అమీతుమికి సిద్ధమయ్యారు.

సోమవారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల మాటల యుద్ధం తారస్థాయికి చేరుతుందన డంలో సందేహమే లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవ్వగా,  విస్మరించిన హామీలు, పాలనా వైఫల్యాలపై పాలక ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. 

అసెంబ్లీకి కేసీఆర్..

ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా సభకు హాజరయ్యే అవకాశం ఉండటంతో.. శాసన సభా సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే అవకాశం ఉంది. సభ మొత్తం అటెన్షన్‌గా మారనుందనే చర్చ జరుగుతుంది. గతేడాది బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారానికి వచ్చారు.

ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. సోమవారం నుంచి జరిగే సమావేశాలకు ఒక రోజే సభకు వస్తారా..? సభ జరిగే రోజులన్నీ హాజరవుతారా..? అనేది ఆసక్తిగా మారింది. శాసన సభా సమావేశాలు మొదటి రోజు ఉదయం 10:30 గంటలకు  ప్రారంభం కానున్నాయి. ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో సంతాపం ప్రకటించనున్నారు.

ఆ తర్వాత గతంలో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చిన ఏడు ఆర్డినెన్స్ ల స్థానంలో.. శాసన సభలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించి.. సభ ఎన్నిరోజులు,  చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం పధానంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపైన చర్చించాలని నిర్ణయం తీసుకున్నది. ఇదే అంశాన్ని బీఏసీలో సర్కార్ స్పష్టం చేయనుంది. తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటాలు, హక్కులు, ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతితో పాటు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితిపైన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

సభ సజావుగా జరిగేలా చూడాలి: స్పీకర్, మండలి చైర్మన్  

తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారం భం కానుండటంతో.. నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. శాసన సభా, మండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బంది ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

శాఖలకు సంబంధించి సభలో చర్చ జరుగు తున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, స భ్యులకు తగిన సమాచారం అందించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సూచించారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందుస్తుగానే సమాచారం అందుకుని వాటిని అడ్డుకోవాలన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేంద ర్‌రెడ్డి మాట్లాడుతూ సభ్యులు అడిగిన ప్రశ్నలు పెండింగ్‌లో ఉంటే వాటికి వెంటనే సమాధానాలు పంపించాలని అధికారులను ఆదేశించారు.   

మంత్రులు, ఎమ్మ్యెలు ఎమ్మెల్సీలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  సమావేశంలో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్‌ముదిరాజ్ , మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మండలి, అసెంబ్లీ కార్యదర్శులు నరసింహాచార్యులు, ఆర్. తిరుపతి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, డీజీపీ శివధర్‌రెడ్డి, ఏడీజీపీ విజయ్‌కుమార్, సీపీలు సజ్జన్నార్, అవినాష్ మహంతి, సుధీర్‌బాబు, ఐజీ కార్తీకేయ, అసెంబ్లీ చీఫ్ మార్షన్ కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. 

నదీ జలాలపై రాజీపడే ప్రసక్తే లేదు..

తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు,  నదీ జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండదని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నానని, సభలో ప్రభుత్వం హుందా తనంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆసెంబ్లీ వరణలో మీడియాతో మాట్లాడుతూ సభలో చర్చించే అంశాలను బీఏసీలో  చర్చించి ఖరారు చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల విషయంలో ప్రతిపక్షాల అనుమానాలను  నివృత్తి చేస్తామని, ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పారు. 

అసెంబ్లీకి కేసీఆర్!

  1. చర్చలో పాల్గొంటారా?.. వెంటనే వెళ్లిపోతారా?

ఆసక్తికరంగా శీతాకాల సమావేశాలు

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): నేటి నుంచి ప్రారంభమవుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. అయితే మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరవుతారని బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.

కాగా, కేసీఆర్ ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి, రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ అసెంబ్లీ వచ్చినా.. చర్చలో పాల్గొంటారా? లేక సంతకం పెట్టి వెళ్లిపోతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నా యి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేసేందుకు బీఆర్‌ఎస్ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా- నదీ జలాల హక్కుల రక్షణ, పాలమూరు ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయిం పులు తగ్గించిన అంశం, రైతు రుణమాఫీ అమలు తీరు, హామీల అమలులో లోపాలు వంటి విషయాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయనున్నట్లు సమాచారం.

మరోవైపు కేసీఆర్ తప్పకుండా అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా డిమాండ్ చేస్తుండటంతో, ఆయన హాజరుపై ఉత్కంఠ మరింత పెరిగింది. మొత్తంగా కేసీఆర్ పునరాగమనం, అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలతో ఈ సారి శాసనసభ సమావేశాలు రాజకీయంగా హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాలను ధీటుగా ఎదుర్కోవాలని సూచించినట్టు సమాచారం.