పంపులను నిరంతరాయంగా నడపాలి
పదే పదే ఆన్, ఆఫ్ చేస్తే పంపులు, మోటార్లు పాడైపోయే ప్రమాదం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కాళేశ్వరం, దేవాదుల వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల మోటార్లను ఇష్టానుసారం ఆన్, ఆఫ్ చేయడం ఇంజినీరింగ్ నిబంధనలకు విరుద్ధమని మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో తీరుపై బుధవారం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటా ర్లు పాడైపోయే ప్రమాదం ఉందని తెలిపారు. భారీ మోటార్లు నిరంతరాయంగా న డిచేలా డిజైన్ చేసినవని, పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదని పేర్కొన్నారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరమని, తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్ నిబంధనల ప్రకారం, డిజైన్‌కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని కోరారు.




