12 March, 2026 | 5:10 PM

సీఎం సభలో సొంత పార్టీ కార్యక్రమంలా వ్యవహరించిన ఎమ్మెల్యే..

06-12-2025 09:06 PM

ప్రజా సమస్యలపై ప్రశ్నించని పాయల్ శంకర్ తీరుపై మాజీ మంత్రి రామన్న మండిపాటు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాకు వచ్చిన సీఎంను ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సింది పోయి, ప్రభుత్వ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సొంత పార్టీ కార్యక్రమంలా నడుచుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల పక్షాన పోరాడటం నేర్చుకోవాలని ఆయన సూచించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

రాష్ట్ర బీజేపీ నేతలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రం ముఖ్యమంత్రిని ఎందుకు పొగుడుతున్నారని, బీజేపీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చనే తాను లేవనెత్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించి ఢిల్లీ లో పైరవీలు చేస్తున్న విషయాన్ని ఆ పార్టీ అగ్రనేత బీ.ఎల్ సంతోష్ శ్రేణులతో చర్చించారని, ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరన్న విషయం సదరు పార్టీ నేతలందరికీ తెలుసని మాజీ మంత్రి పేర్కొన్నారు. తన వ్యక్తిత్వం గురించి ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసనీ, ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసమే పని చేశానని తెలిపారు.

ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాపారులతో భూములు కొనిపించడంతో ప్రస్తుతం వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. సీసీఐ ను కేంద్రమే పునఃప్రారంభిస్తుద్నని గతంలో కేంద్ర మంత్రి హెచ్.డీ కుమార స్వామి స్పష్టమైన హామీ ఇచ్చారని, ప్రస్తుతం పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ స్వంత పార్టీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే నయవంచనకు గురి చేశారని ఆరోపించారు. బీజేపీ పార్టీ కార్యాలయ నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని, కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో వ్యక్తిగత విషయాలను ప్రస్తావనకు తీసుకురాకుండా హుందాగా ప్రవర్తించాలని హితభోద చేశారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.