ఏపీ నికర జలాల దోపిడీ
వెలుగొండకు తరలింపును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలి
వరద నీటి వినియోగానికే ప్రాజెక్టు
సీఎం రేవంత్‌రెడ్డి మౌనం.. రాష్ట్రానికి దుర్దినం
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నికర జలాల దోపిడీకి పాల్పడుతోందని, దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అడ్డుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టు కేవలం వరద నీటిని మాత్రమే వినియోగించాలని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి మౌనం వహించడం రాష్ట్రానికి సోమవారం దుర్దినంగా మారిందని విమర్శించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ నుంచి నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. కృష్ణా నది వరద జలాల వినియోగం కోసమే నిర్మించిన వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాలను వినియోగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహిస్తోందని తీవ్రంగా విమర్శించారు.
సోమవారం వనపర్తి జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా, ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర హక్కుల అంశాలను వైట్‌బోర్డుపై చిత్రాలతో సుమారు రెండు గంటల పాటు వివరించారు.
వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలను మాత్రమే వినియోగించాలన్న నిబంధన ఉందని, అయితే నికర జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ, ముఖ్యంగా పాలమూరు ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. పాలమూరు- ఎత్తిపోతల పథకం పనులు 2023 నాటికే సుమారు 90 శాతం పూర్తయ్యాయని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
పంపింగ్ స్టేషన్లు, నాలుగు రిజర్వాయర్లు, టన్నెళ్లతో పాటు ప్రధాన పనులు పూర్తయ్యా యని తెలిపారు. నార్లాపూర్- లింక్ కెనాల్ సహా మిగిలిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా పూర్తి చేయడం లేదని విమర్శిం చారు. ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే పాలమూరు జిల్లాలో పెద్దఎత్తున నీటి నిల్వ సామర్థ్యం పెరిగేదని తెలిపారు. ప్రాజెక్టు పనులు ఆలస్యమైతే ఇతర రాష్ట్రాల ప్రయోజనా లకు అవకాశం కలుగుతుందని ఆరోపించారు. తెలంగాణ జలహక్కులపై పోరాటం కొనసాగుతుందన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యం, జూరాల వద్ద వరద జలాల వినియోగం, ఎస్‌ఎల్బీసీ టన్నెల్ పనులు తదితర అంశాలను నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. గతంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం తాము పోరాడామన్నారు. తెలంగాణ జలహక్కులపై అవగాహన లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరిం చారు. పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టుల ను తీసుకొచ్చామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో గట్టు యాదవ్, వామనగౌడ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్‌గౌడ్, అశోక్ పాల్గొన్నారు.






