22-02-2026 12:12:39 AM
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్
మెదక్‌లో గుండాల పాలన సాగుతోంది
అక్రమంగా కేసులు బనాయించారు
సంగారెడ్డిలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సంగారెడ్డి, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): డీజీపీ శివధర్‌రెడ్డి ఖాకీ బుక్.. రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయిందని, రేవంత్‌రెడ్డి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఎందుకు మౌనంగా చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న 13 మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలను హరీశ్‌రావు శనివారం పరామర్శించారు.
జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. మౌఖిక ఆదేశాలతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులే రేపు చట్టం ముందు జవాబుదారీ అవుతారని, ఈ గుండాయిజంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిల దీస్తామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవలేక, పోలీసు లాఠీలతో, అక్రమ కేసులతో నెగ్గాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, దానికి నిదర్శనమే ఈ 13 మంది కార్యకర్తల అక్రమ అరెస్టు అని అన్నారు.
మెదక్ మున్సిపాలిటీలో రాత్రిపూట దౌర్జన్యంగా ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి, ఆమెను బెదిరించి, బట్టలు చింపే ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గన్‌మన్ దాడి చేశాడని, ఆ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తల పైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్ట డం కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమని దుయ్యబట్టారు. కనీసం మెడికల్ రిపోర్ట్ లేకుండా 307 కేసు ఎలా నమోదు చేస్తారు? పోలీసులు గుడ్డిగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో మెదక్‌లో అర్ధరాత్రి కాన్వాయ్ తో తిరిగిన ఎమ్మెల్యే వాహనాలను ఎందుకు సీజ్ చేయలేదని, డబ్బులు పంచుతుంటే డీఎస్పీ ఎందుకు అడ్డుకోలేదన్నారు. ఘర్షణ సమయంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కారు ఎక్కించిన వారిపై, ఆటోపై పెట్రోల్ పోసిన వారిపై ఆధారాలుగా వీడియోలు ఇచ్చినా ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని నిలదీశారు. పోలింగ్ బూత్‌లో బీఆర్‌ఎస్ ఏజెంట్‌ను అధికారుల ముందే చంపేస్తానని బెదిరించిన మెదక్ ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో ఆపిన రైతుబంధును వెంటనే రైతుల ఖాతాల్లో వేయాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పక్షాన ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని, ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.