8 July, 2026 | 1:53 AM

మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి కన్నుమూత

08-07-2026 12:53 AM

సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం 

యాదాద్రి భువనగిరి, జూలై 7 (విజయక్రాంతి): భువనగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కొమ్మిడి నరసింహారెడ్డి (85) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశా రు. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి రామచంద్రారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు నరసింహారెడ్డి నాలుగో సంతానం.

నరసింహారెడ్డి భార్య సుకన్య. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆస్తులేమీ కూడబెట్టకుండా, ఒక పాత స్కూటర్ మినహా సొంత ఇల్లు కూడా నిర్మించుకోకుండా నిరాడంబర జీవితాన్ని గడిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని కీలక పాత్ర పోషించారు. 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున భువనగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తెలంగాణలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆయన జీవితాంతం పోరాడారు. గోదావరి జలాలను మూసీ నదిలోకి మళ్లించి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికను రూపొందించారు. సీసీఎంబీ, నిమ్స్ ఈయన కృషి ఫలితంగానే ఏర్పాటయ్యాయి. భుజానికి ఒక జత బట్టలతో కూడిన చిన్న సంచి, చేతిలో నోటు పుస్తకంతో రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాలకు హాజరవుతుండేవారు. భూదానోద్యమంలో పాల్గొన్న కొమ్మిడి నరసింహారెడ్డి తనకున్న వందల ఎకరాల భూములను పేదలకు పంచాడు. 

నిజాయతీతో జీవించారు: సీఎం రేవంత్

కొమ్మిడి నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నర్సింహారెడ్డి తుదిశ్వాస వరకు నీతి, నిజాయతీతో జీవించారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాలను నిర్వహించి నిత్యం ప్రజల పక్షాన నిలిచారని గుర్తుచేశారు. భూదానోద్యమానికి తన 300 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతావాదిగా స్మరించుకున్నారు. 

ప్రజల మనిషి నర్సింహారెడ్డి: కేసీఆర్

ప్రజల మనిషి నర్సింహారెడ్డి అని మాజీ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. భూదానోద్యమంలో వందలాది ఎకరాలను పేదలకు పంచిన నర్సింహారెడ్డి, 1969 ఉద్యమంలో పాల్గొని, మూసి పరిరక్షణ, తెలంగాణకు గోదావరి నదీ జలాల కోసం కృషి చేశారని తెలిపారు.