రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ
రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర
తల్లాడ (సత్తుపల్లి),(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలనే డిమాండ్‌తో రైతుల ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా ప్రారంభించకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య రైతులతో కలిసి తల్లాడ మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వేలాది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఎక్కడా సక్రమంగా కొనుగోళ్లు ప్రారంభం కాలేదని విమర్శించారు.
రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేయమని సూచించిన అదే ప్రభుత్వం, ఇప్పుడు కొనుగోళ్లు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లారని అన్నారు. పార్బాయిల్డ్ షెడ్ల ద్వారా కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు గంటకు దాదాపు వెయ్యి రూపాయల వరకు నష్టపోతున్నారని అయిష్టం వ్యక్తం చేశారు. సరైన ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం వల్ల రైతులు కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీంతో రైతులు పంటను బయట వ్యాపారులకు తక్కువ ధరలకే అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. మాజీ సీఎం కే.సీ.ఆర్ హయాంలో అన్ని కొనుగోలు ఏర్పాట్లు సమన్వయంతో ఉండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేవారని గుర్తుచేసారు.
ప్రస్తుతం రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. కోతల సమయం వచ్చినా రైతు భరోసా అందలేదని, ఇది ప్రభుత్వ పెద్ద వైఫల్యమని పేర్కొన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసి రైతుల సమస్యలను నేరుగా ప్రభుత్వానికి విన్నవించి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం తల్లాడ లోని తాసిల్దార్ కార్యాలయానికి రైతులతో చేరుకొని రిప్రెసెంటేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






