23-02-2026 09:16:50 PM
మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై పీడీయాక్ట్ కేసు క్రింద నగర బహిష్కరణ చేయాలి
గతంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలకు అదే నాయకత్వం ప్రోత్సహించింది
ప్రతిపక్ష నేతలు కులం, మతం, ప్రాంతల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్, కాంగ్రెస్ కార్యకర్తపై జరిగిన దాడి ఘటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సోమవారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయిన కొంతమంది ప్రతిపక్ష నేతలు ఇంకా గుండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
ఉద్యమ కాలంలో అధికారులపై దాడులకు పాల్పడిన నాయకత్వం ఇప్పటికీ అదే స్వభావంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. బిఆర్ఎస్ కార్పొరేటర్ మా కాంగ్రెస్ కార్యకర్తపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. గతంలో తోట పవన్‌పై జరిగిన దాడిని కూడా గుర్తుచేస్తూ, ఇది ఒంటరి ఘటన కాదని, క్రమపద్ధతిలో జరుగుతున్న దాడుల శ్రేణిలో భాగమని అన్నారు. నిన్నటి ముఖ్యమంత్రి పర్యటనపై అవాకులు చెవాకులు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. మా ప్రభుత్వం ప్రజల పక్షాన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో ఓపిక పాటించాలని సూచిస్తున్నప్పటికీ, ఆ సహనాన్ని ప్రతిపక్షాలు బలహీనతగా భావిస్తున్నాయని నాయిని వ్యాఖ్యానించారు. ఇకపై కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు కులం, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర పోలీస్ శాఖ ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిన్నటి ఘటనలో మా కార్యకర్త ప్రాణాపాయం జరిగి ఉంటే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
వినయ్ భాస్కర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, రాజకీయ లాభాల కోసం జిల్లాను ముక్కలు చేశారని ఆరోపించారు. గతంలో భద్రకాళీ ఆలయ పరిసరాల్లో గుడిసెల తొలగింపుపై తీర్మానం చేసింది అదే నాయకత్వమని, ఇప్పుడు అమ్మవారి పేరుతో రాజకీయాలు చేయడం ద్వంద్వ వైఖరని పేర్కొన్నారు. భద్రకాళి అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఆపాలని సూచించారు. ప్రశాంత నగరాన్ని అస్థిరపరిచేలా వ్యవహరిస్తే పిడియాక్ట్ కింద కేసు నమోదు చేసి నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలకు కూడా అదే నాయకత్వం ప్రోత్సాహం ఇచ్చిందని ఆరోపించారు.
పదేళ్ల అధికార కాలంలో కాలనీ, డివిజన్ స్థాయి సమస్యలపై దృష్టి సారించనివారు, ఇప్పుడు ప్రజా ప్రయోజనాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అక్రమ సంపాదనలతో రాజకీయాలు చేయడం ఆపాలని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పటికీ మా సహనం బలహీనత కాదని, అభివృద్ధి మా సిద్ధాంతమని, కక్షపూరిత రాజకీయాలు మా స్వభావం కాదని స్పష్టం చేశారు. కార్యకర్తల రక్షణ విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలోబ్లాక్ కాంగ్రెస్ నాయకులు బంక సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, డివిజన్ అధ్యక్షులు ఏనుకొంటి పున్నం చందర్, తడుక సుమన్ గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.