25 July, 2026 | 12:31 PM

ఫ్లవర్ కాదు ఫైర్

03-06-2024 12:00 AM

మెజారిటీ సర్వేలు ఏకపక్షంగా తేల్చింది ఇదే

బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని సాధిస్తుందని అంచనా

దక్షిణాదిలోనూ మోదీ హవా నడుస్తుందని స్పష్టం

బెంగాల్‌లో దీదీ ప్రభుత్వానికీ చెక్ పెడుతుందని జోస్యం

హైదరాబాద్, జూన్ 2: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ ఎగ్జిట్ పోల్స్ హడావుడి మొదలైంది. అందరి చూపు జూన్ 4న వెలువడే తుది ఫలితాలపైనే ఉన్నా అంతకుముందే పలు మీడియా, ప్రైవేట్ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వేలు ఏకపక్షంగా ఎన్‌డీఏకే పట్టం కట్టాయి. ఎన్నికల సీజన్ అంతా 400కుపైగా సీట్లు సాధిస్తామన్న బీజేపీ నినాదానికి తగ్గట్టే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నాయి. ఎంతోకాలంగా బీజేపీకి అందని ద్రాక్షగా మారిన దక్షిణాదితోపాటు బెంగాల్‌లోనూ కమలం వికసిస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

ఇండియా టుడే, సీఎన్‌ఎక్స్, టుడేస్ చాణక్య అనే మూడు సంస్థలు ఎన్‌డీఏ గరిష్ఠంగా 400 పైచిలుకు స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని కచ్చితంగా నిర్ధారించలేం. 2019 ఎన్నికల్లో సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ రికార్డు స్థాయిలో 303 స్థానాల్లో గెలుపొంది. ఎన్‌డీఏతో కలుపుకుని 352 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు ప్రధాని నరేంద్రమోదీ పాపులారిటీకి కూడా పరీక్ష కానున్నాయి. ఈ అంచనాలు నిజమైతే హ్యాట్రిక్ కొట్టి మోదీ రికార్డు సాధిస్తారు. 

యూపీలో అదే హవా

80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 2019లో బీజేపీ 62 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అప్పుడు సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు పొత్తు పెట్టుకున్నా బీజేపీని ఆపలేకపోయాయి. ఇప్పుడు బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయగా, ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో ఎస్పీ కలిసి పోటీ చేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ బలంగా ప్రచారం చేసింది. ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ ముందుండి నడిపించారు. బీజేపీ మాత్రం యూపీలో 80 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. రామమందిరం ప్రభావం, యోగి పాలన తమకు కలిసి వస్తాయని కమలం పార్టీ భావించింది. ఈ ఎన్నికల్లోనూ యూపీలో బీజేపీకే అనుకూలమని సర్వేలు తెలిపాయి. కానీ, 62 నుంచి 66 సీట్లు మాత్రమే సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

దక్షిణాదిపై పట్టు దొరికేనా?

ఇక, దక్షిణాదిలో ఎప్పటినుంచో పాగా వేయాలని బీజేపీ ఆశిస్తోంది. హిందీ రాజకీయాలు ద్వీపకల్పం లో పనిచేయలేదు. ఒక్క కర్ణాటక తప్ప కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ, ఈ సారి ఎన్నికల్లో కాషాయ దళం ఊహించని ఫలితాలు సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని పేర్కొన్నాయి. తెలంగాణలో మెజార్టీ స్థానాలు సాధిస్తుందని సర్వేలు చెప్పగా.. ఏపీలో టీడీపీతో కలిసి 20 సీట్ల వరకు ఎన్‌డీఏ గెలుస్తుందని పేర్కొన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత పార్టీ బలాన్ని పెంచుకుంది.

పార్లమెంట్ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. అయితే, ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని సర్వేలు చెప్పాయి. బీజేపీ ఓట్ షేర్ 43 శాతానికి చేరే అవకాశం ఉందని, కనీసంగా 8 సీట్లు సాధిస్తుందని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. బీఆర్‌ఎస్ ఓట్ షేర్ అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల్లో 13 శాతానికి పడిపోతుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నాలుగైదు సీట్లకు పరిమితం చేస్తే అది స్వయంకృత అపరాధమే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నా రు. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో చాలా మంది బీఆర్‌ఎస్ నుంచి వలస వచ్చిన వారే. బీజేపీకి మాత్రం అభ్యర్థులు కాకుండా మోదీ చరిష్మా సహకరిస్తుందని అంటున్నారు.

బెంగాల్‌లో మార్పు..

బెంగాల్‌లో ఈసారి బీజేపీ ఆధిక్యం సాధిస్తుందని ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ సర్వే పేర్కొంది. ఆ రాష్ట్రంలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా బీజేపీకి 22 సీట్లు, అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు 14 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయని వెల్లడించింది. కాంగ్రెస్ మాత్రం ఒకటిరెండు సీట్లతో సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. బెంగాల్‌లో కమల వికాసానికి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహమే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బెంగాల్‌లో అవినీతి, ఉపాధి అవకాశాలు మందగించడం, ఫ్యాక్టరీల మూసివేత, శాంతిభద్రతల సమస్యలు సర్వ సాధారణంగా మారాయి. సందేశ్‌ఖాలీ ఘటన, కొన్ని అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు బీజేపీకి అనుకూలంగా మారాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దీంతో బెంగాల్‌లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడినట్లు పలువురు అంచనా వేస్తున్నారు. రామనవమి ఊరేగింపుపై రాళ్లు రువ్విన విషయంలో మమత ప్రభుత్వం మౌనంగా ఉండటంపై చాలా విమర్శలు వచ్చాయి. ప్రజల్లో దీదీ ప్రభుత్వంపై ఆగ్రహం పెరగడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు.

కాంగ్రెస్‌తో ఢీ!

అంతేకాకుండా ద్రవిడ, ప్రాంతీయ వాదం ఎక్కువగా ఉండే తమిళనాడు, కమ్యూనిస్టుల కంచుకోట కేరళలో ఈసారి ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై నేతృత్వంలో పార్టీ ఎప్పుడూ లేనంత ఉత్సాహం తో పనిచేసింది. కొన్ని సీట్లలో బలమైన అభ్యర్థులను నిలిపింది. కర్ణాటక విషయానికి వస్తే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు పలు పథకాలను తీసుకొచ్చింది. ఉచిత బస్సు, ప్రతినెలా రూ.2,000 భృతి అందిస్తోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మరో అగ్రనేత డీకే శివకుమార్ కర్ణాటకపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇది కర్ణాటకలో కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. కానీ, 2019 తరహాలో ఎన్‌డీఏ స్వీప్ చేస్తుందని, 25 స్థానాల్లో విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇదే జరిగితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ.. కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది.