21-01-2026 12:42:13 AM
‘సుప్రీం’ ఆదేశాలను ఉల్లంఘించలేదు
సీపీ సజ్జనార్ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (విజయక్రాంతి): పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును విచారించి నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ఎదుట హరీశ్‌రావు హాజరయ్యారు. అయితే, సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున, తనను వెళ్లనివ్వాలని హరీశ్‌రావు అధికారులకు విజ్ఞప్తి చేశారని, అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని విచారణను ముగించి ఆయన వెళ్లెందుకు అనుమతిచ్చామని సీపీ ప్రకటనలో తెలిపారు.
హరీశ్ రావును ఇంటికి పంపించే ముందు సిట్ అధికారులు పలు ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తుతో సంబం ధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, వారిని ప్రభావితం చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని అధికారులు ఆయనకు స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారి కంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపైనే హరీశ్‌రావును ప్రశ్నించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.