13 June, 2026 | 5:03 PM

అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం

13-06-2026 04:02 PM

- మంచిర్యాలకి పీఎస్ఆర్ కావాల్సిన నిధులు తెచ్చుకుంటుండ్రు...

- డిప్యూటీ సీఎం 

దండేపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటు పడుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు, మినీ లిప్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేసేందుకు జిల్లాకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.

అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం ప్రజలనుద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోని తెలంగాణ అన్నవరంగా పేరొందిన గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే వచ్చేదికాంగ్రెస్ ప్రభుత్వమేనని, నియోజక వర్గాన్ని విద్య, వైద్య రంగాలతో పాటు ఆలయాలు, రోడ్లు, మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధి కోసం ఒక విజన్ ఏర్పాటు చేసుకొని ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారన్నారు.

మంచిర్యాల నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు సంబంధిత శాఖ మంత్రుల వద్దకు నేరుగా వెళ్లి నిధులు తెప్పించుకోవడంలో మొదటి స్థానంలో నిలిచారన్నారు. అనంతరం రూ. 70 కోట్లతో సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులను, రూ. 74 కోట్లతో లిప్ట్ ఇరిగేషన్ పనులకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎంఎల్సీ దండె విఠల్, మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు, రామగుండం ఎంఎల్ఏ మక్కాన్ సింగ్ లతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డిసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ డి సీ సీ అధ్యక్షురాలు సురేఖ, మేయర్ దర్ని మధుకర్, తదితరులు పాల్గొన్నారు.