17 April, 2026 | 4:22 PM

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

24-11-2025 12:00 AM

పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే, కలెక్టర్ 

నిజామాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఆర్మూర్ నియోజకవర్గంలో  అభివృద్ధి పనులకు ఆదివారం జిల్లా పాలనాధికారి టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బి.మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి తదితరులు అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. 

ఆంధ్రనగర్ నుండి ఇందిరానగర్ మీదుగా లక్నపూర్ వరకు రూ. 2.28 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీ.టీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నందిపేట్ శివారులో జన్నేపల్లి మెయిన్ రోడ్డు నుండి లక్కంపల్లి,చింరాజ్ పల్లి మీదుగా తల్వేద వరకు రూ.6.93 కోట్లతో చేపట్టనున్న ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణ పనులకు, ఐలాపూర్ గ్రామంలో రూ. 2.45 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ బాలుర హాస్టల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ప్రతీ చోట ప్రజాప్రతినిధులను, కలెక్టర్ ను ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.