గ్రామపంచాయతీ ఎన్నికల మహిళా స్థానాల రిజర్వేషన్లు ఖరారు
గద్వాల, నవంబర్ 23 (విజయక్రాంతి) : తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఆయా మండలాల వారీగా సంబంధిత గ్రామపంచాయతీలకు మహిళ రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. ఆదివారం గద్వాల ఆర్డిఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో డిప్ ద్వారా మహిళ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదట 2019లో జరిగిన సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిబంధనల ప్రకారం ప్రస్తుతం జరిగే ఎన్నికలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాల్లో మహిళలకు కేటాయించాల్సిన 33% రిజర్వేషన్లను డిప్ విధానంలో ఖరారు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అలివేలు, డిపిఓ నాగేంద్రం, ఇతర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






