calender_icon.png 12 February, 2026 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి

12-02-2026 06:03:56 PM

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు-రేసు ఎల్లయ్య

కనీస వేతన చట్టం అమలు చేయాలి

వజ్జ సుశీల సీఐటీయూ జిల్లా నాయకురాలు

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం ఏఐటీయూసీ-సీఐటీయూ ఆళ్లపల్లి మండల సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ  సభ్యులు రేసు ఎల్లయ్య మాట్లాడుతూ.... అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మికుల శ్రమను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్నదని దానిలో భాగంగానే ముందు తరాల కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరించి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందన్నారు.

వేతనాల కోడ్ ను 2019లో పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 సెప్టెంబర్ లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరూ వీటిని వ్యతిరేకిస్తూ పార్లమెంటును బైకాట్ చేసిన సందర్భంలో దేశం మొత్తం కరోనా కష్టకాలంలో ఉండగా పార్లమెంటులో ఆమోదింప చేసుకున్నారు. ఈ దేశ ప్రజల, కార్మికుల సంక్షేమం కంటే,  కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే వీరికి ముఖ్యమన్నారు.

ఈ ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెల ఫలితంగా అమలుకు పూనుకోని కేంద్ర ప్రభుత్వం 2025  నవంబర్ లో  నోటిఫై చేసి, 2026, ఏప్రిల్ నుండి అమలుకు  సిద్ధమవుతుందన్నారు. ఈ లేబర్ కోడ్ లు అమలు అయితే కార్మిక హక్కులు కాల రాయబడతాయి అన్నారు. వీటిని తిప్పకొట్టవలసిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందన్నారు. లేకపోతే కార్పొరేట్ శక్తులకు కార్మిక వర్గం కట్టు బానిసలుగా తయారయ్యే ప్రమాదం ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కొమరం హన్మంతరావు,కసనబోయిన నరేష్ గొగ్గల రాజేందర్  పూనెం సుజాత, ఏఐటీయూసీ  నాయకురాలు అరుణ  నర్సమ్మ నాగమణి.సీఐటీయూ నాయకురాలు సుగుణ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు