18 July, 2026 | 12:20 AM

రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

18-07-2026 12:20 AM
  1. మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలానికి చెందిన ఇద్దరు
  2. స్కూటీని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
  3. రెండు ప్రమాదాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

మేడ్చల్, జూలై 17 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర ఘట్‌కేసర్ మధ్య జరిగిన ప్రమాదంలో కటికే రషీద్ (42), రాములు (48) మరణించారు. కటిక గౌస్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన సోదరులు కటికే రషీద్ కటిక గౌస్ పాపన్నపేట గ్రామానికి చెందిన డ్రైవర్ రాములు అశోక్ లేలాండ్ వాహనంలో మేకలు గొర్రెల కొనుగోలుకు హైదరాబాద్‌కు వచ్చి రింగురోడ్డు మీద రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటుండగా లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో రషీద్, రాములు అక్కడికక్కడే మృతిచెందగా, గౌస్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు స్కూటీ మీద వెళుతుండగా రింగ్ రోడ్డు బ్రిడ్జి కింద 44వ నెంబరు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి స్కూటీని ఢీ కొట్టింది. దీంతో సోహేల్ (18) సుమిత్ (19) అక్కడికక్కడే మరణించారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.