నేను సీనియర్.. నువ్వు జూనియర్ !
ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
చందుర్తి, జూలై 17( విజయక్రాంతి )పాఠశాలలో విద్యార్థులకు పాఠా లు చెప్పే ఉపాధ్యాయులే గల్లాలు పట్టుకొని కొట్టుకోవడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయులలోను నేను సీనియర్ నీవు జూనియర్ అనే వివాదం నెలకొంది, సీనియర్ ను కాదని జూనియర్ కి బాధ్యతలు అప్పగిస్తున్నారని సంవత్సర కాలంగా ఉపాధ్యాయుల మధ్య వివాదం నెలకొంది.తరగతి గదిలో భావి భారతాన్ని నిర్మించాల్సిన ఉపాధ్యాయులే కయ్యానికి కాలు దువ్వడం చందుర్తి మండలం బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది.
ప్రధానోపాధ్యాయుడు ఆనంద రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయుడు రామచంద్రం మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా తయారయింది.ఉపాధ్యాయ హాజరు నమోదు విషయంలో కొద్ది రోజులుగా వివాదం తలెత్తడంతో సీనియర్ ఉపాధ్యాయుడు రామచంద్రం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో ఉపాధ్యాయ హాజరు నమోదులో సంతకం చేసేందుకు వచ్చిన తనను ప్రధానోపాధ్యాయుడు ఆనంద రెడ్డి అడ్డుకోవడంతో ప్రశ్నించిన తనపై దాడికి దిగాడని వాపోయారు. దీంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకొని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్త్స్ర రమేష్ విచారణ చేపట్టారు.






