రష్యాలో నలుగురు మెడికోల మృతి
నలుగురూ మహారాష్ట్ర వాసులే
మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ, జూన్ 8 : రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలోని వోల్ఖోవ్ నదిలో మునిగిపోయారు. ఈ నలుగురి వయస్సు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపే ఉంటుంది. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికి తీయగా.. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
వారు కూడా బ్రతికే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. భారతీయ విద్యా ర్థుల మృతదేహాలను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు భారత విదేశాంగ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని భారత కాన్సులేట్ అధికారులు, అక్కడి యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ సైతం స్పందించింది. మృతదేహాలను ఇక్కడికి తీసుక్చొందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది.
అసలేం జరిగిందంటే?
రష్యాలోని పురాత నగరమైన నోవ్గోరోడ్‌లోని యూనివర్సిటీలో మహారాష్ట్రకు చెందిన జిషన్ పింజారీ, జియా పింజారీ, హర్షల్ అనంత్‌రావ్, మాలిక్ మహమ్మద్ యాకూబ్, నిషా సోనావానే అనే విద్యార్థులు వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. శుక్రవారం ఖాళీ సమయంలో సమీపంలోని వోల్ఖోవ్ నదీ తీరానికి వాకింగ్ వెళ్లారు. నడుస్తుండగా అకస్మాత్తుగా ఒక అమ్మాయి నదిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు మిగతా నలుగురూ నీదిలోకి దిగారు. ప్రమాద తీవ్రత పెరగడంతో నలుగురూ కొట్టుకుపోయారు. వీరిలో నిషా అనే అమ్మాయిని స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల మృతితో వారి స్వస్థల్లో విషాదం నెలకొంది.






