ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట.. 8 మంది మృతి
బెంగళూరు: బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల్లో(RCB Victory Celebrations) అపశృతి చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గరకు పెద్దసంఖ్యంలో క్రికెట్ అభిమానులు(Cricket Fans) చేరుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 8 మంది మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు. సొమ్మసిల్లిన పిల్లాడిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) విజయం సాధించి తొలి కఫ్ ను సొంతం చేసుకుంది.
కాగా, అహ్మదాబాద్ నుంచి బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఐపీఎల్ ఫైనల్ విజేత ఆర్సీబీ బృందానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Karnataka Deputy CM DK Shivakumar) పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి ఆర్సీబీ జట్టు ప్రత్యేక బస్సులో విధాన సౌధకు చేరుకుంది. దారి మధ్యలో వేలాది మంది అభిమానులు ఆర్సీబీ జెండాలతో ఎర్ర సముద్రాన్ని తలపించేలా కిక్కిరిసిపోయారు.
మరి కాసేపట్లో ఆర్సీబీ జట్లు సభ్యులకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరకున్నారు. ఆర్సీబీ అభిమానులతో చిన్నస్వామి స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోవడంతో స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా తోసుకెళ్లిన అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.




