8 June, 2026 | 2:14 AM

పిచ్చికుక్క కాటుకు నలుగురికి తీవ్ర గాయాలు

08-06-2026 12:51 AM

జహీరాబాద్, జూన్ 7: జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో పిచ్చి కుక్క కాటుకు న లుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. తుమ్మనపల్లి గ్రామానికి చెందిన కొనింటి చంటయ్య, ఎంపల్లి ఏసయ్య. బేలూరు విష్ణువర్ధన్ రెడ్డి, రిజ్వానా బేగంలకు తీవ్ర గాయాలయ్యాయి.

వీరిని హుటాహుటిన జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్ రెడ్డి, ఏసయ్య పరిస్థితి దుర్భరంగా ఉండటంతో వారిని హైదరాబాద్లోని కోరంటి హాస్పిటల్ కి తరలించేందుకు వైద్యులు సూచించారు. మిగతా వారిని  కూడా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. గ్రామస్తులందరూ పిచ్చి కుక్కను వెంబడించి చంపి భూమిలో పాతిపెట్టారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈ పిచ్చికుక్క వేరే గ్రామం నుంచి వచ్చిందని తమ గ్రామంలో కుక్కల బెడద లేదని ఆయన తెలిపారు.