ఎల్‌ఈడీ లైట్లతో రాత్రి ప్రయాణం ఇబ్బందికరం
నిబంధనలు పాటించని వాహనాల యజమానులు
బోథ్, జూన్ 7 (విజయక్రాంతి): రాత్రిపూట వాహనాలపై ప్రయాణం చేయాలంటే ఎదురుగా వస్తున్న వాహనాల ఎల్ఈడి హెడ్ లైట్స్ వాహన చోదకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నూతనంగా వాహనాలకు అమర్చుకున్న ఎల్‌ఈడి లైట్లు ఎదురుగా వస్తున్న వాహన చోదకుల కండ్లను కమ్మేస్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు
నిబంధనలు బేకాతర్..
వాహనాలను నడిపే వారు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాల వారి ఇబ్బందులను గుర్తించకుండా వాహనాలను నడుపుతున్నారు. వాస్తవానికి ఎదురుగా వస్తున్న వాహనాల వారికి ఇబ్బంది కలగవద్దు అంటే హెడ్లైట్లను డిప్పర్ చేయాల్సి ఉంది. కానీ ఆ విషయాన్ని మరిచి అతివేగంగా నడుపుతున్నారు. దీంతో ఎదురుగా ఉన్న గుంతలు కనిపించగా పోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు..
హెడ్‌లైట్ల పైన సగం స్టిక్కర్ మాయం..
వాహనాలకు ఉన్న హెడ్ లైట్ ల పైన ప్రభుత్వ నిబంధనల ప్రకారం సగం వరకు బ్లాక్ స్టిక్కర్లు ఉండాల్సి ఉంది. అయితే ఈ విషయాన్ని అనేకమంది వాహనాల వారు పట్టించుకోవడం లేదు. దీంతో ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్ల కండ్లు మసకబారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణపై పోలీస్ రోడ్డు రవాణా శాఖ అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కలిగిస్తున్న హెడ్ లైట్ల పైన సగం బ్లాక్ స్టిక్కర్ వేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా అధికారులు హెడ్ లైట్ల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.






