19 August, 2026 | 5:42 PM

పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.1 లక్ష మోసం

19-08-2026 04:55 PM

నిందితునిపై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

నిందితుడి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్

ఉట్నూర్,(విజయక్రాంతి): గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.1 లక్ష తీసుకుని మోసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ తెలిపారు.

నిందితుడి వివరాలు..

A1) పడ్ రాజు, S/o లేట్ రఘునాథ్, మన్నూర్ గ్రామం

పోలీసుల వివరాల ప్రకారం.. మన్నూర్ గ్రామానికి చెందిన భూరే స్వప్నిల్‌కు అదే గ్రామానికి చెందిన నిందితుడు పడ్ రాజు పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకోసం రూ.1 లక్ష ఇవ్వాలని కోరగా, 11.05.2018న బాధితుడు తన తల్లి తేజమ్మ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతా నుంచి నిందితుడి ఖాతాకు రూ.1 లక్ష బదిలీ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ ఉద్యోగం ఇప్పించకుండా, తీసుకున్న నగదును తిరిగి ఇవ్వకుండా మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 231/2026, సెక్షన్ 420 IPC కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ప్రజలు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులు, వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అధికారిక నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియను మాత్రమే విశ్వసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ ఎస్సై ఎల్ శ్రీకాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.