23 May, 2026 | 2:39 AM

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో మోసం

23-05-2026 01:19 AM

ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం

ముషీరాబాద్, మే 22 (విజయక్రాంతి): గ్రామీణ రోజ్ గార్ యోజనలో ఉద్యోగాలిప్పిస్తాముని నమ్మబలికి రూ.15లక్షలు వరకు వసూలు చేసి చివరికి మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రామగుండం, మారేడుపాక గ్రామానికి చెందిన బాధితుడు పాలం ఐలయ్య డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహ ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

తనకు పోసాని శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయం అని, ఆయన ద్వారా రాచాల రాజేందర్ కలిశారన్నారు. ఇతరు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి 15 మందికి సంబంధించిన డబ్బులు వసూలు చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పదేళ్లయినా ఉద్యోగం లేదన్నారు. దీనిపై నిలదీస్తే బెదిరిస్తున్నారని వాపోయారు. తమను మోసం చేసిన శ్రీనివాస్, రాజేందర్‌ల నుంచి వడ్డీతో సహా రూ. 15 లక్షలు ఇప్పించాలని అయిలయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆత్మహత్యే శరణ్య మన్నారు. ఈ సమావేశంలో అయిలయ్య భార్య పొలం లక్ష్మి, పొలం సత్యసాగర్, అది కర్ణాకర్, మామిడి సతీశ్, తావిడి స్వాతి, పొన్నం వెంకటేశ్, మామిడి గంగారం, తావిటి రాయమల్లు, సామాజికవేత్త సునీత తదితరులు పాల్గొన్నారు.