భూ కబ్జాదారులతో వసూళ్ల ప్లానింగ్..!
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ కార్యాలయంలో వసూళ్ల పర్వం తారాస్థాయికి చేరుతోంది. భూ భకాసురులు, రియల్ టర్లు ప్రభుత్వ భూములను కబ్జాచేసి అడ్డగోలుగా కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నా, టౌన్ ప్లానింగ్ అదికారులు పట్టించుకోకుండా తీరా పనులు ప్రారంభించాక నోటీసులు ఇచ్చి తెర వెనుక కద్దర్ నేతల చేత సెటిల్మెంట్లు చేసే ప్రక్రియకు తెరలేపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జా చేసిన భూమి వ్యాల్యూ బట్టి ఆ అధికారులు రేట్ ఫిక్స్ చేసుకుని వసూళ్లకు ప్లాన్ చేసుకుంటున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరి సిబ్బందిని పురమాయించి కబ్జాదారుల నుండి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో విలీనం చేసిన కొన్ని గ్రామాల్లో నేటికీ గ్రామపంచాయితీ అనుమతులు, పట్టాలు ఇచ్చినట్లు తప్పుడు పతాలు సృష్టించినా అవేవి పటించుకోకుండా వారికి అనుమతులను ఇచ్చేస్తున్నారు. కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిలోనే కమర్శియల్ కాంప్లెక్సులు, ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా వారికి అడ్డగోలుగా అనుమతులను ఇచ్చేస్తూ ప్రభుత్వ భూములకు, ప్రభుత్వ ఆదాయానికి మంగళం పాడుతున్నారు. మరి కొన్ని నిర్మాణాలు సెట్ బ్యాక్ తీసుకోకపోయినా అవేవి వినిపించుకోకుండా చేతిలో డబ్బు పెడితే చాలు వారికి అనుమతులు ఇచ్చేస్తున్నట్లు ఆరోపనలు ఉన్నాయి.
ప్రభుత్వ భూములన్నీ మాయం..!
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో పాటు మున్సిపాల్టీగా మారడంతో సమీప గ్రామాలైన ఉయ్యాలవాడ, నెల్లికొండ, నాగనూలు, ఎండబెట్ల గ్రామపంచాయతీలను నాగర్ కర్నూల్ మున్సిపాల్టీలో విలీనం కావడంతో ఆయా గ్రామాల్లోని కోట్లు విలువజేసే ప్రభుత్వ భూములపై రియల్ వ్యాపారులు, కబ్జాదారులు కన్నేసారు. ప్రభుత్వ భూములకు ఆనుకొని ఉన్న ప్రయివేటు భూములను కొనుగోలు చేసి కొద్దికొద్దిగా ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్నారు. అందులో ముందుగా మొక్కలు, బోరుబావులు, లేదా పశువుల కొట్టం, పశుగ్రాసం ఇలా మొత్తంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే అదునుగా బావించిన మున్సిపల్ అధికారులు వారికి ముందుగా సమీప కౌన్సిలర్ చేత బేరసారాలకు దిగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వినకపోతే నోటీసులు ఇచ్చి భూమి ధరకు అనుగుణంగా రేట్ నిర్ణయించి లక్షల్లో డబ్బు దండుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. చివరకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో కోట్లు విలువజేసే ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు సైతం తమవాటా తాము తీసుకుని తీమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. నిబంధనలు తూచా తప్పకుండా పాటించే వారికి మాత్రం ఇంటి నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయాల చుటూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని బాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విచారించి చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న విషయం నాదృష్టికి రాలేదు. వాటిని పరిశీలించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. సెట్ బ్యాక్ విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: నరేష్ బాబు, మున్సిపల్ కమీషనర్, నాగర్‌కర్నూల్






