ఆర్ఎంపీలను బతకనివ్వరా?
ఎన్ఎంసీ దాడులను తక్షణమే ఆపాలి..
ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం డిమాండ్
జనగామ: గ్రామస్థాయిలో తక్కువ ఖర్చుతో వైద్య సేవలందిస్తున్న ఆర్ఎంపీలు, పీఎంపీలపై ఎన్ఎంసీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, నిత్యం దాడులు చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆర్ఎంపీలు, పీఎంపీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, ఉపాధ్యక్షుడు వెంకటాచారి ఆరోపించారు. ఎన్ఎంసీ దాడులను నిరసిస్తూ గురువారం జనగామలో కలెక్టరేట్ ఎదుట సంఘం జిల్లా అధ్యక్షుడు పనునూరి సత్యనారాయణ అధ్యక్షతన ఆర్ఎంపీలు, పీఎంపీలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. అంతకుముందు స్థానిక నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్విరామంగా ఎన్ఎంసీ తమపై తనిఖీల పేరుతో చేస్తున్న దాడులను ఆపాలన్నారు. అర్హులందరికీ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. అవసరమైన ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంతెన రమేశ్, ఆలేటి సురేందర్ రెడ్డి, మంగ రామకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.






