16 March, 2026 | 2:27 PM

ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంటును మారుస్తామని మోసం

18-10-2025 12:00 AM

-భువనగిరి, ఆలేరు, మునుగోడు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలి

- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 17 (విజయక్రాంతి) ః బిఆర్‌ఎస్ ప్రభుత్వలో ఏకపక్షంగా రూపొందించిన త్రిబుల్ ఆర్ అలైన్ మెంట్ ను మేము అధికారంలోకి వస్తే మారుస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఒప్పించ లేని పరిస్థితుల్లో ఉండి ప్రజలను మోసం చేశారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు ఆరోపించారు. రైతులను దగా చేసిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజనామా చేసి త్రిబుల్ ఆర్ నిర్వాసితుల పక్షాన పోరాడాలని సూచించారు.

శుక్రవారం నాడు సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో త్రిబుల్ ఆర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, అలైన్మెంట్ ను మార్చాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముంద నిర్వాసిత రైతులతో సామూహిక నిరాహార దీక్ష - వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీతారాములు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అశాస్త్రీయంగా ఉన్నదని వెంటనే మార్చాలని కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఓఆర్‌ఆర్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యన 40 కిలోమీటర్ల దూరం ఉండాలని మొదటి అలైన్మెంట్లో ప్రకటించిన ప్రకారం ఎందుకు అమలు చేయడం లేదని ఎవరి ప్రయోజనాల కోసం అలైన్మెంట్ మార్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రింగ్ రోడ్ అంటే వంకలు, డొంకలు, మలుపులు ఎట్లా ఉంటాయని ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్డును రద్దు చేయాలని సీతారాములు డిమాండ్ చేశారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో 8 మండలాలు 43 గ్రామాల్లోని వందలాది ఎకరాల విలువైన సాగుకు యోగ్యమైన, భూమే ఆధారంగా బతుకుతున్న రైతులు తమ భూములను కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికే రైతులు బస్వాపురం రిజర్వాయర్ పేరుతో, కాల్వల పేరుతో, హైదరాబాదు- విజయవాడ, హైదరాబాదు- వరంగల్ జాతీయ రహదారుల పేరు, హై టెన్షన్ విద్యుత్ స్తంభాలు, వైటీడిఏ పేరిట భూములు కోల్పోయి తీవ్ర మనోవేదనతో, మానసిక క్షోభను అనుభవిస్తూ అనేకమంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మార్చి భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు భూమికి బదులు - భూమి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న బహిరంగ మార్కెట్ ధర ఘనంగా మూడింతలు రేటును కలిపి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి గారికి మెమోరండం అందించినారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, త్రిబుల్ ఆర్ నిర్వాసితుల నాయకులు అవిశెట్టి పాండు అధ్యక్షత వహించగా ఇంకా

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గభ్యులు మాటూరు బాలరాజు దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిర్పంగి స్వామి దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బోలగాని జయరాములు, గంగదేవి సైదులు, గడ్డం వెంకటేష్, సీనియర్ నాయకులు దొంతగాని పెద్దులు, శ్రీనివాస రెడ్డి, నాయకులు పల్లెర్ల అంజయ్య, వనం రాజు ఈర్లపల్లి ముత్యాలు లావుడియ రాజు వడ్డేబోయిన వెంకటేష్ గంటేపాక శివ, లలిత తదితరులు పాల్గొన్నారు.