26 August, 2026 | 2:41 AM

ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

26-08-2026 12:00 AM
  1. మెడికవర్ ఆధ్వర్యంలో నిర్వహణ
  2.   150 మందికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు

నిజామాబాద్ ఆగస్టు 25 (విజయక్రాంతి): మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుట్టలోని మెడికవర్ హాస్పిటల్‌లో మంగళవారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పురుషులకు పీఎస్‌ఏ పరీక్ష, మహిళలకు మ్యామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలు, అలాగే వైద్యుల సంప్రదింపులు ఉచితంగా అందించారు.

క్యాన్సర్‌కు సంబంధించిన అనుమానాలు, లక్షణాలు ఉన్నవారికి వైద్యులు అవసరమైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి చందర్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్  మాట్లాడుతూ, క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వయస్సు, కుటుంబ చరిత్ర, ఇతర ప్రమాద కారకాలను బట్టి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం ఎంతో ముఖ్యమని సూచించారు.

డాక్టర్ అన్వేష్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ, మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్స్ప నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత వ్యవధుల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పురుషులు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించిన ప్రమాదాలను గుర్తించి అవసరమైన సమయంలో పీఎస్‌ఏ వంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంచడంతో పాటు, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను వివరించడమే ఇలాంటి ఆరోగ్య శిబిరాల ప్రధాన లక్ష్యమని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు డాక్టర్ వర్ష మెడికల్ ఆంకాలజిస్ట్  తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ మార్కెటింగ్ మేనేజర్ దినేష్  పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది క్యాన్సర్ పరీక్షలు చేసుకున్నారు.