calender_icon.png 16 July, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెర్ప్ ద్వారా మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ

18-06-2025 11:51:55 PM

రోల్‌మోడల్‌గా సరితా నాయక్..

మంత్రి సీతక్క..

హైదరాబాద్ (విజయక్రాంతి): సెర్ప్ ద్వారా మహిళలకు బస్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తామని మంత్రి సీతక్క(Minister Seethakka) వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా సేవలందిస్తున్న సరితను బుధవారం శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... మహిళల డ్రైవింగ్ శిక్షణకు రోల్‌మోడల్‌గా సరితను నియమిస్తున్నట్టు ప్రకటించారు. సరితను ఆదర్శంగా తీసుకుని మహిళలు డ్రైవింగ్‌తో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.

ఎంవోడబ్ల్యూవో స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ కార్యచరణను ఆవిష్కరించారు. త్వరలో సెర్ప్ ద్వారా ఆసక్తి గల మహిళలకు భారీ వాహనాల డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వంతో చర్చించి ఆర్టీసీలో మహిళా డ్రైవర్ల రిక్రూట్‌మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా..

పేదరిక నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని(టీజీఐఎల్‌పీ) ప్రారంభిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో టీజీఐఎల్‌పీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ స్మ్రితి శరణ్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, బ్రాక్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... అత్యంత వెనుకబడిన 6 వేల కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు.

వెనుకబడిన కుటుంబాలను ఆర్థిక పథంలో నిలిపేందుకు ఈ కార్యక్రమం కృషి చేస్తుందని తెలిపారు. ఆదిమ జాతులు అంతరిస్తున్నాయని, వాటి పరిరక్షణ కోసం బ్రాక్ సంస్థతో కలిసి పనిచేస్తామన్నారు. ఆదిమ జాతుల ఆర్థిక ప్రగతిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. సమగ్ర ఉపాధి అవకాశాల ద్వారా పేదల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు వారి సుస్థిరాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.