6 July, 2026 | 2:12 AM

ములుగు పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ రిక్రూట్‌మెంట్ కోచింగ్

06-07-2026 01:10 AM

7000 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ 

ములుగు (మహబూబాబాద్) జూలై 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ, ఎస్పీఎఫ్, జైళ్ల శాఖ తదితర విభాగాల్లో సుమారు 7,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, ములుగు జిల్లా నిరుద్యోగ యువతకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ములుగు జిల్లా పోలీసు శాఖ  ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ తెలిపారు.

యువతకు బంగారు అవకాశమని, ఉచిత శిక్షణ కోసం సమీప పోలీస్ స్టేషన్ లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. మహిళా అభ్యర్డులను స్వాగతిస్తున్నామని, తమ కలల్ని సాకారం చేసుకోవాలని, గ్రామీణ, మారుమూల ప్రాంతాల పేద యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్ పీ కోరారు. అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన అధ్యాపకులు, ఫిజికల్ ట్రైనర్లతో ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.

ఈ కోచింగ్లో ఉచిత వసతి, తరగతి బోధన, శారీరక శిక్షణ అందించబడుతుందని, ములుగు జిల్లాలో ముఖ్యంగా పేద, గ్రామీణ, గిరిజన మరియు మారుమూల ప్రాంతాల యువతీ యువకులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ జీవిత లక్ష్యాన్ని సాధించాలని కోరారు. పోలీసు శాఖలో చేరాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సమీప పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలని, కోచింగ్ ప్రారంభ తేదీ, స్థలం, ఇతర పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్నారు.