6 July, 2026 | 2:12 AM

ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

06-07-2026 01:10 AM

తిరుమలాయపాలెం, జూలై 5 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామానికి చెందిన ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగన్న మరణం ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు.

పీడిత ప్రజల పక్షాన నిలుస్తూ, విప్లవ గీతాలతో చివరి శ్వాస వరకు ప్రజలను చైతన్యపరిచిన గొప్ప ప్రజా గాయకుడిగా నాగన్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో చైతన్యం నింపేందుకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని, ప్రజల హక్కుల కోసం తన గాత్రాన్ని అంకితం చేసిన అరుదైన కళాకారుడని అన్నారు.

ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. నాగన్న ఆశయాలను కొనసాగించడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని కందాళ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.