calender_icon.png 6 December, 2024 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భిక్షాటన నుంచి డాక్టర్ దాకా..

05-11-2024 12:00:00 AM

పింకీ హర్యాన్.. చిన్నవయసులోనే తల్లిదండ్రులతో కలిసి భిక్షాటన చేసి.. చెత్త కుప్పల్లో దొరికే ఆహారంతో పొట్టనింపుకునేది. బాలకార్మికురాలిగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఓసారి భిక్షాటన చేస్తున్న పింకీని టిబెటన్ సన్యాసి జమ్యాంగ్ గమనించి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదుకున్నాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులను ఒప్పించి చదివించాడు.

2004లో ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నిరుపేద పిల్లల కోసం హాస్టల్లో పిల్లల్లో పింకీ ఒకరు. ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్లో హర్యాన్ అడ్మిషన్ పొందింది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పటికీ చదువుపై దృష్టి పెట్టింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్)లో కూడా ఉత్తీర్ణులరాలైంది.

ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్లోని టోంగ్-లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ సహాయంతో 2018లో చైనాలోని ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందింది. ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసి ధర్మశాలకు తిరిగొచ్చింది. ప్రస్తుతం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ) కోసం సిద్ధమవుతూ తన కలను సాకారం చేసుకుంది.

‘చిన్నప్పటి నుండి పేదరికంపై పోరాటం చేస్తూ వచ్చాను. నా కుటుంబం కష్టాల్లో ఉండటం బాధాకరం. అందుకే ఉన్నత చదువులు చదివాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నా’ అని పింకీ హర్యాన్ చెప్పారు. ఈసందర్భంగా నాలుగేళ్ల వయస్సులో డాక్టర్ కావాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేసినట్లు గుర్తుచేసుకుంది ఈ అమ్మాయి.