‘ఫార్మా హబ్’ ఏర్పాటుకు పూర్తిస్థాయి సహకారం
- ఘనా పారిశ్రామికాభివృద్ధికి ‘తెలంగాణ’ మార్గనిర్దేశం
- రిపబ్లిక్ ఆఫ్ ఘనా ఉన్నత స్థాయి బృందం భేటీలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ‘ఫార్మా హబ్’కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ ఒబువాడుం టానో నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సచివాలయంలో బుధవారం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా ‘తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఘనా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 24 అవర్ ఎకానమీ అండ్ యాక్సలరేటెడ్ ఎక్స్ పోర్ట్ డెవలెప్ మెంట్ ప్రోగ్రాం, ఫార్మా హబ్ ఏర్పాటు తదితర అంశాలను ఆగస్టస్ ఒబువాడుం టానో వివరించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఆనతికాలంలోనే పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింద న్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీ’లను ఆయన వివరించారు. ఘనా పారిశ్రామిక, ఆర్థిక పరివర్తనలో తెలంగాణ ఒక నమ్మకైన భాగస్వామిగా ఉంటుందని భరోసానిచ్చారు.






