16 April, 2026 | 12:21 AM

పున్నమి వెన్నెల

03-11-2025 12:58 AM

పున్నమి వెన్నెల పూసింది ఆకాశం -

తేనె వెల్లువలా పారింది మాధుర్యం

జాబిలి చిందిన ముత్యాల జలధార -

పుడమి ముఖముపైన జార్చె పసిడి హారం


పొలాలపై మెరిసె వెండి ముసురు -

గాలిలో తియ్యగా తేల్చె తిమిర సౌరభాలు

నదీ తీరాన యువకుల మదులందు -

కౌముదిలో తేలాడె ప్రేమగాథల ఊహలు


తోటలోని పూలను తాకిన చంద్రిక -

తేనెలా కరిగి చేరెను మనసుల

చెరువుల మీద ఆడగా చుక్కలచిలుకలు -

చిమ్మె చందమామ చక్కని చిరునవ్వులు


పల్లె బాటలపైన పరచుకొన్న శ్వేతవర్ణము -

మట్టివాసనతో నింపె 

హృదులందు మమకారము.

పొగమంచునందు పారె పగటి కలలు -

ప్రతి కిరణము పాడె మౌనమేళము


చెట్టు గూళ్లలో పక్షులు నిద్రించగా -

గుప్పెడు మదులలో మెరిసె జ్వాలలు

ఆ కైరవిలో తట్టిన జ్ఞాపకాలు -

దింపే ప్రణయంలో, లేపే విపరీత కోర్కెలు


సముద్ర తీరాన కెరటాలు ఆడగా -

ఆకాశంలో చందిరిక నర్తించె మయూరిగా

నిశ్శబ్దంలో మెరిసె తట్టెడు తలపులు -

ఆ వెలుగే కవిత్వము ఆ నిశీధే భావము

నిండు పున్నమి చక్కని చంద్రాతపము -

ప్రకృతి, ప్రీతి తడిమె కవులమదులను

పాఠకుల హృదులలో 

ముద్రవేసిన మృదురూపము -

అదే శాశ్వత మాధుర్యపు 

జ్ఞాపకాల సౌధము