8 August, 2026 | 9:08 PM

నగర అభివృద్ధికి నిధులు తెండి

08-08-2026 07:47 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్లలో మొత్తం రుణం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కు  రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని అందులో కేంద్రానిది ఒక్క రూపాయి కూడా వాటా లేదు.

అర్బన్ చాలెంజ్ ఫండ్ 840 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం 210 కోట్లు ఇవ్వగా హడ్కో రుణం 420 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని కేవలం 25 శాతం వాటా 210 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తుందని మొత్తం 840 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.స్మార్ట్ సిటీ బ్యాలన్స్ 140 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు జమ చేసిందని కేంద్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపిందని వీటన్నింటి పై బండి సంజయ్ కుమార్ చర్చకు సిద్ధమా అని నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు.ఇప్పటికైనా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకురావాలని యువతకు నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ఏదైనా ప్రాజెక్ట్ తీసుక రావాలని లేకపోతే కరీంనగర్ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నట్లుగా భావించవలసి వస్తుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.