16 May, 2026 | 8:45 PM

సమస్యల పరిష్కారమే లక్ష్యం

16-05-2026 08:08 PM

మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్

బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం నుండి వరంగల్ ప్రధాన రహదారి రోడ్డుకు 3కోట్లు నిధులు మంజూరు

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ నగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు కొత్త ఊపు వచ్చింది. నగరాభివృద్ధికి కోసం పని చేస్తున్న తోటకూర అజయ్ యాదవ్ కృషి ఫలించింది.అంబేద్కర్ విగ్రహం నుండి–వరంగల్ ప్రధాన రహదారి పనులకు 3 కోట్ల నిధులు మంజూరై  టెండర్లకు సిద్ధంగా ఉందని మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం నుండి వరంగల్ ప్రధాన రహదారి వరకు ఉన్న రోడ్డు సమస్య పరిష్కార దశకు చేరుకుంది.

బోడుప్పల్–చిలుకానగర్ రోడ్డు, బంగారు మైసమ్మ దేవాలయం నుండి చెంగిచెర్ల వరకు ఉన్న ప్రధాన రహదారి పనులు కూడా త్వరలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి,సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కీర్ హరినాథ్ రెడ్డిలతో కలిసి‌ ధన్యవాదాలు తెలిపారు. పాలకవర్గం లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు ముందుండి పని చేస్తానని, ఈ ప్రాంత అభివృద్ధే తన లక్ష్యమని మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ స్పష్టం చేశారు.