తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నియామకం పట్ల హర్షం
తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేక కమిటీని నియమించడం పట్ల తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాసు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం చిట్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీతో పాటు ఉమ్మడి జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీర కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేక కమిటీని నియమించడం పట్ల సంజయ్ దాస్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల కుటుంబాలు, అలాగే ఎన్నో కష్టనష్టాలు భరించి ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు, ప్రతి ఉమ్మడి జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
స్థానిక స్థాయిలో కమిటీలు ఉంటే నిజమైన ఉద్యమకారులను గుర్తించడం సులభమవుతుందని, అర్హులైన వారందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు సముచిత గౌరవం, గుర్తింపు, సంక్షేమం అందుతుందనే పూర్తి నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వ పరంగా సరైన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.






